ఈ మధ్య పెద్ద సినిమాలకి ప్రీమియర్స్ వేయాలంటేనే భయపడేలా చేసింది అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా. ఆ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయితే.. డిసెంబర్ 4 రాత్రి నుండే ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ ను ఎక్కువ స్క్రీన్స్ లో ఏర్పాటు చేశారు. టికెట్ రేట్లు ఏకంగా రూ.1200 వరకు పెట్టారు. అయినా జనాలు వెళ్లారు. కానీ అల్లు అర్జున్ చెప్పా చేయకుండా సంధ్య థియేటర్ కి వెళ్లడం.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం అనేది అందరికీ తెలిసిన సంగతే.
దీంతో అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ‘పుష్ప 2’ వల్ల రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీమియర్ షోలకు తెలంగాణ గవర్నమెంట్ అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఇక పెద్ద సినిమాలకు ప్రీమియర్ షోలు ఉండవేమో అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాకి ప్రీమియర్ షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కానీ ఎక్కువ స్క్రీన్స్ లో ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్స్ పడటం లేదు.
లిమిటెడ్ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే ప్రీమియర్ షోలు పడుతున్నాయి. పోనీ వాటికైనా అడ్వాన్స్ బుకింగ్స్ కరెక్ట్ గా ఓపెన్ అయ్యాయా అంటే అదీ లేదు. 80 శాతం బ్లాకింగ్ ఉన్నాయి. 20 శాతం మాత్రమే టికెట్లు బుకింగ్స్ కి అనుమతి ఇస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ వీరాభిమానులు నిర్మాతని, డిస్ట్రిబ్యూటర్స్ ని తిట్టిపోస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ప్రీమియర్ షోలు వేస్తున్నప్పుడు బుకింగ్స్ కరెక్ట్ గా ఓపెన్ అయితేనే.. వచ్చే కలెక్షన్స్ లో ప్రభుత్వానికి కరెక్ట్ గా టాక్స్ వెళ్తుంది.
లేదు అంటే అది బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళకి మాత్రమే కలిసి వస్తుంది. అధికారికంగా బుకింగ్స్ ఓపెన్ చేస్తే జనాలు కూడా రూ.2000 అలా టికెట్లకు పెట్టి.. వారి జేబులకు చిల్లు పెట్టుకోకుండా చేసినట్లు అవుతుంది’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ ‘హరిహర వీరమల్లు’ విషయంలో పవన్ చెప్పినట్టు జరగడం లేదు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.