జ్యోతిక ముందు ఇద్దరు చంద్రముఖిలు ఉన్నారు తెలుసా? మరచిపోతే ఎలా?

  • September 25, 2023 / 06:44 PM IST

‘చంద్రముఖి’… ఈ పేరు వినగానే మీకు ఠక్కున గుర్తొచ్చే పేరు చెప్పడం అంటే… జ్యోతిక అనేస్తారు. ఎదుకంటే ‘చంద్రముఖి’ సినిమాలో ఆమె నటన అంతటి ప్రభావం చూపించింది. రాణీ చంద్రముఖి ఆవహించగానే జ్యోతిక చూపించిన నటనా కౌశలం అంతటి పేరు వచ్చేలా చేసింది. అప్పటివరకు జ్యోతిక చేసిన పాత్రలు ఒక లెక్క… ఆ సినిమాలో ఆమె పాత్ర మరో లెక్క అని చెప్పొచ్చు. అయితే అంతకంటే ముందు మరో ఇద్దరు చంద్రముఖిలు ఉన్నారని తెలుసా?

అవును, ‘చంద్రముఖి’ సినిమా తమిళ – తెలుగులో వచ్చింది. కానీ అలాంటి కథ/అదే కథతో ఓ సినిమా అంతకుముందే వచ్చింది. 1993లో మలయాళలో ‘మణిచిత్రతజు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఫాజిల్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో మలయాళ ఇండస్ట్రీలో ఓ క్లాసిక్‌ అని అంటుంటారు. ఆ సినిమా వసూళ్లు కూడా అదే స్థాయిలో అదిరిపోయాయి. అందులో చంద్రముఖిగా కనిపించింది శోభన. ఆమె నటనకు చప్పట్లు, పురస్కారాలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత 2004వ సంవత్సరంలో విష్ణువర్థన్ హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమలో ‘ఆప్తమిత్ర’ అనే పేరుతో ఆ సినిమాను రీమేక్‌ చేశారు. అక్కడ కూడా అదే ఫలితం. ఈ సినిమాలో దివంగత స్టార్‌ కథానాయిక సౌందర్య చంద్రముఖి పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాతనే ‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు, తమిళంలో జ్యోతిక అలరించింది. ఇప్పుడు ఆ పాత్రను కంగనా రనౌత్‌ చేసింది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘చంద్రముఖి 2’ సినిమాతో కంగనా రనౌత్‌ చంద్రముఖి అవుతోంది. అయితే ఇందులో ఆమె చంద్రముఖి ఆత్మగా కనిపించబోతోంది అని టాక్‌. ఈ నేపథ్యంలో చంద్రముఖి అంటే కంగననో, జ్యోతికనో కాదు… అంతకుముందు మరో ఇద్దరు ఉన్నారు అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ లెక్కన భారతీయ సినిమా పరిశ్రమలో చంద్రముఖి అంటే నలుగురు గుర్తొస్తారు అని చెప్పాలి. అన్నట్లు బాలీవుడ్‌లో కూడా ఉంది. అయితే మాతృక అంశాన్ని మాత్రమే తీసుకున్నారు. అందులో చంద్రముఖిగా కనిపించింది విద్యా బాలన్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus