‘భీమ్లా నాయక్’ దూకుడును అడ్డుకట్ట వేయడానికి… డేనియల్ శేఖర్ సినిమాలో చాలా పనులు చేస్తాడు. తనకు తెలిసిన అన్ని దారులు వాడేస్తాడు. ఆఖరికి ‘తెలుగు’ ట్విస్ట్‌తో డేనియల్ శేఖర్ బతికి బట్టకడతాడు. అయితే ఇదంతా సినిమాలో. మరి బయట ‘భీమ్లా నాయక్’ను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అందులో ఎన్ని ఫలించాయో తెలియదు కానీ… శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో చాలా థియేటర్ల దగ్గర పోలీసుల లాఠీల ఊపుడు శబ్దాలు, మంత్రులకు నిరసనల సెగలు కనిపించాయి. ఎక్కడేం జరిగిందో ఓసారి చూద్దాం.
టికెట్ రేట్లు తక్కువంటూ…
* ఇప్పుడున్న టికెట్ ధరలు గిట్టుబాటు కావని మైలవరంలో రెండు థియేటర్లను తాత్కాలికంగా మూసేశారు.
* టికెట్ రేట్ల విషయంలో సమస్యతో తిరువూరులో నాలుగు, నందిగామలోని మరో థియేటర్‌లో భీమ్లా నాయక్‌కి బదులు వేరే చిత్రాలు వేశారు.
* ఉయ్యూరు, కైకలూరు, ముదినేపల్లెలో కొన్నిచోట్ల తొలుత వేరే సినిమా వేసినా తర్వాత మార్చారు.
* తక్కువ ధరలకు సినిమా ప్రదర్శన సాధ్యం కాదని కైకలూరులో ఒక థియేటర్‌ను మూసివేస్తుండగా… పవన్ అభిమానులు అడ్డుకున్నారు.
* ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో సినిమా వేయలేమని పెదనందిపాడులో ఒక థియేటర్‌ను యాజమాన్యం మూసివేసింది.
* ప్రభుత్వ తక్కువ ధరలకు సినిమా వేయలేమని అద్దంకిలోని సత్యనారాయణ కళామందిర్‌లో మొదటి షో రద్దు చేశారు. దీంతో అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టారు.
* టికెట్ ధరల కారణంగానే… విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం, పాయకరావుపేట, పరవాడలోని ఐదు థియేటర్లలో చిత్ర ప్రదర్శన చేయలేదు.
* విజయనగరం జిల్లా కొత్తవలసలో టికెట్ ధరలు గిట్టుబాటు కాదని మూడు థియేటర్లలో మొదటి రెండు షోలూ నిలిపివేసి సాయంత్రం నుంచి మళ్లీ ప్రదర్శించారు
మీరెలా వస్తారంటూ మంత్రుల్ని…
పవన్ కల్యాణ్‌పై కక్ష సాధిస్తూ, ఆయన సినిమా వేస్తున్న సినిమా హాలు ప్రారంభానికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరు గుడివాడలో జీ3 సినిమా కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఇది జరిగింది. దీంతో అభిమానులను పోలీసులు చెదరగొట్టి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రీమియర్ షోలు వేయలేదని…
* ‘భీమ్లా నాయక్’ ప్రత్యేక ప్రదర్శన వేయాలని విస్సన్నపేట-తిరువూరు రహదారిలో పవన్ అభిమానులు ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
* ఫిరంగిపురంలోని ఈశ్వరసాయి థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన వేస్తున్నట్లు ముందుగా టిక్కెట్లు అమ్మి, ప్రదర్శించకపోవడంతో అభిమానులు ఆందోళన చేపట్టారు.
* తూర్పుగోదావరిలో ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతివ్వకపోవడాన్ని నిరసిస్తూ అభిమానులు అమలాపురం, రాజవొమ్మంగిలో ఆందోళనలు చేపట్టారు.
ఎక్కువ రేట్లకు అమ్మారని…
* జగ్గయ్యపేటలోని కమల థియేటర్‌లో అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించినందుకు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత థియేటర్ యాజమాన్యానికి రూ.50 వేల జరిమానా విధించారు.
* గుంటూరు కొల్లూరులో సినిమా ప్రదర్శించడానికి థియేటర్‌కి బీఫామ్ లేదని సినిమా ప్రదర్శన రద్దు చేయడంతో పవన్ అభిమానులు బస్టాండ్ సెంటర్‌లో బైఠాయించి స్థానిక ఎమ్మెల్యే, తహసీల్దార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వేమూరు-భట్టిప్రోలు మార్గంలో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.
* అధిక ధరలకు టిక్కెట్లు అమ్మినందున చిత్ర ప్రదర్శనకు వీల్లేదని ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శాంతి, ప్రశాంతి థియేటర్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో పవన్‌కల్యాణ్ అభిమానులు, జనసేన నేతలు ఆందోళనకు దిగారు.
ఇవి మరికొన్ని చోట్ల…
* గన్నవరంలో రెండు, హనుమాన్ జంక్షన్లో మరో థియేటర్లలో సాంకేతిక కారణాల పేరుతో సినిమా ప్రదర్శన నిలిపివేశారు.
* విజయవాడ శైలజ థియేటర్ దగ్గర పవన్ అభిమానులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
* పాకాలలో చిత్ర ప్రదర్శనలకు అధికారులు అడ్డంకులు సృష్టించడంతో రామకృష్ణ థియేటర్ ముందు పవన్ అభిమానులు ధర్నా చేశారు.
* పుత్తూరులోని విష్ణుమహాల్, శాంతి థియేటర్‌లో కొద్దిసేపు ఆలస్యంగా చిత్రాన్ని ప్రదర్శించారు.
* అనంతపురం తాడిపత్రిలో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పవన్ అభిమానులు ఆగ్రహించారు. కుర్చీలు ధ్వంసం చేసి తలుపులు బద్దలకొట్టారు.
‘భీమ్లా నాయక్’ సినిమా ప్రదర్శనకు ఏపీలో ప్రభుత్వం ఇన్ని రకాలు ఇబ్బందులు పెట్టినా, సాంకేతిక కారణాలతో సమస్యలు వచ్చినా అభిమానులు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోయారు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!