సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో కొందరు ఇండస్ట్రీ సభ్యులు మీడియా ముఖంగా మాట్లాడుతుంటే.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. రీసెంట్ గానే నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏపీలో టికెట్ రేట్ల పరిస్థితి గురించి మాట్లాడారు. తాజాగా హీరో నిఖిల్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూతపడడం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు నిఖిల్ ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.20 టికెట్ సెక్షన్ ఉందని.. కాబట్టి సినిమా థియేటర్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవుతున్నాయని చెప్పారు.
ట్రైన్ లో ఏ విధంగా అయితే కంపార్ట్మెంట్ ఆధారంగా చేసుకొని టికెట్ డబ్బులు వసూలు చేస్తారో.. అదే మాదిరిగా బాల్కనీ, ప్రీమియర్ సెక్షన్ల టికెట్ ధరల్లో సవరింపులు చేయాలని అధికారులను కోరారు నిఖిల్. ప్రేక్షకులకు ప్రతిక్షణం ఆనందాన్ని అందిస్తోన్న సినిమాహాళ్లు తనకు దేవాలయాలతో సమానమని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా థియేటర్లు మూతపడడం చూస్తుంటే హృదయం ముక్కలవుతోందని అన్నారు.
ఇలాంటి కష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలబడడం సంతోషంగా ఉందని అన్నారు. అలానే థియేటర్లు పూర్వవైభవం సొంతం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు నిఖిల్. ఇక సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ హీరోగా నటించిన 18 పేజీస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు ‘కార్తికేయ2’ సినిమాలో నటిస్తున్నారు ఈ హీరో.