Shyam Singha Roy Review: శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

“వి, టక్ జగదీష్” వంటి వరుస ఒటీటీ రిలీజుల అనంతరం దాదాపు మూడేళ్ళ తర్వాత నాని నటించగా థియేటర్లో విడుదలైన చిత్రం “శ్యామ్ సింగరాయ్”. “ట్యాక్సీవాలా” ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తిని కలిగించాయి. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: వాసు (నాని) పెద్ద డైరెక్టర్ అయిపోవాలని కలలు కనే ఓ చిన్న అసిస్టెంట్ డైరెక్టర్. షార్ట్ ఫిలిమ్స్ తీసి తన టాలెంట్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో పరిచయమైన కీర్తి (కృతిశెట్టి)ని ప్రేమిస్తాడు. తన డైరెక్షన్ డెబ్యూ కోసం కథలు రాయడం మొదలెడతాడు. మొత్తానికి తన కథ ఒకే అవ్వడం, సినిమా తీయడం, అది పెద్ద హిట్ అవ్వడం, వాసు స్టార్ డైరెక్టర్ అవ్వడమే కాక అదే కథతో బాలీవుడ్ డెబ్యూ కూడా ప్లాన్ చేసుకుంటాడు.

అన్నీ సెట్ అనుకునే సమయానికి.. కథ కాపీ రైట్ ఇష్యూ అంటూ పోలీసులు వచ్చి వాసుని అరెస్ట్ చేస్తారు. కలకత్తాకు చెందిన 1970 నాటి “శ్యామ్ సింగరాయ్” రచనలను వాసు కాపీ కొట్టాడని కేస్ వేస్తారు.

అసలు శ్యామ్ సింగరాయ్ రచనలు, వాసు సినిమాగా ఎలా మారాయి? తన జీవితంలో ఒక్కసారి కూడా చదవని రాయ్ రచనలను వాసు సినిమాగా ఎలా తీయగలిగాడు? అసలు శ్యామ్ సింగరాయ్ ఎవరు? అతనికి వాసుతో సంబంధం ఏమిటి? ఈ కథలో మైత్రి అలియాస్ రోజి (సాయిపల్లవి) పాత్ర ఏమిటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “శ్యామ్ సింగరాయ్” చిత్రం.

నటీనటుల పనితీరు: అసలు నాని కొత్తగా కనిపించి ఓ అయిదేళ్లవుతోంది. ఎప్పుడో 2015లో వచ్చిన “జెండా పై కపిరాజు” తర్వాత నాని కాస్త భిన్నంగా కనిపించిన సినిమా ఇదే. నటుడిగానూ చాన్నాళ్ల తర్వాత కొత్తదనం ప్రదర్శించాడు నాని. వాసు పాత్రలో ఎప్పట్లానే కనిపించినా.. శ్యామ్ సింగరాయ్ గా మాత్రం అదరగొట్టాడు. సబ్టల్ గా నటించడం అనేది నాని ప్రతి సినిమాలోనూ చేసేదే.. అయితే.. ఈ సినిమాలో గంభీరంగా కనిపిస్తూనే అండర్ ప్లే చేసి నటుడిగా ఒక మెట్టు ఎక్కాడు. నానిని కొత్తగా చూడాలని తాపత్రయపడిన మహేష్ కత్తి బ్రతికుంటే సంబరపడిపోయేవాడు.

సాయిపల్లవి పోషించిన దేవదాసీ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. చాలా మెచ్యూర్డ్ రోల్ ను ఆమె కూడా అంతే మెచ్యూరిటీతో పోషించింది. క్లైమాక్స్ సీన్ లో ఆమె నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చాలా చక్కని పరిణితి ప్రదర్శించింది.

“ఉప్పెన”తో బెబమ్మగా భీభత్సమైన ఫ్యాన్స్ బేస్ ను సంపాదించుకున్న కృతిశెట్టి, “ప్రేమమ్” ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ పాత్రలు చిన్నవే అయినప్పటికీ.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. బెంగాలీ నటుడు జీషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్స్ ను జస్టిస్ చేశారు.

 

సాంకేతికవర్గం పనితీరు: సాను జాన్ వర్గీసీ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను షూట్ చేసిన విధానం, లైటింగ్ ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. ముఖ్యంగా సెకండ్ నాని క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన ఫ్రేమ్స్ & టింట్ కలర్ భలే ఉన్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం కంటే సీతారామశాస్త్రి గారి ఆఖరి రెండు పాటలైన “సిరివెన్నెల, ప్రణవాలయ” పాటల సాహిత్యం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ క్రిస్ప్ గా ఉంది. ఇక అన్నిటికంటే.. బాగా ఆకట్టుకున్న విషయం ఆర్ట్ వర్క్. సినిమా ఇంత బడ్జెట్ అయ్యిందా అని షాక్ అయిన ప్రతి ఒక్కరూ ఫ్రేమ్స్ & ఆర్ట్ వర్క్ చూసి సాటిస్ఫై అవుతారు.

దర్శకుడు రాహుల్ ఒక సాధారణ కథను కొత్తగా ప్రెజంట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. ప్రతి సన్నివేశాన్ని ఒక పెయింటింగ్ గా తీర్చిదిద్దాడు. అయితే.. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ.. కథనం కన్వీన్సింగ్ గా సాగలేకపోయింది. అందువల్ల ఆడియన్స్ కథ లేదా క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేయలేరు. సబ్ ప్లాట్స్ ఎక్కువైపోయాయి. అలాగే కామెడీ కోసం కాస్త ఎక్కువగా తాపత్రయపడ్డాడు. అందువల్ల ఆ నవ్వించే కొద్దిపాటి సన్నివేశాలు కూడా ఫోర్స్ద్ సీన్స్ లా ఉన్నాయి. అలాగే.. క్లైమాక్స్ రాసుకున్నంత పకద్భంధీగా సెకండాఫ్ రాసుకోలేదు.

ఆడియన్స్ ఎండింగ్ చూసి సంతోషంగా ఫీలైనప్పటికీ.. ఏదో లోపించింది అనే భావన మాత్రం వెంటాడుతుంది. రెండో సినిమాకి దర్శకుడిగా రాహుల్ చాలా పరిపక్వత చెండాడనే చెప్పాలి. అయితే.. కొన్ని కమర్షియల్ పారామీటర్స్ ను కూడా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సొ, మూడో సినిమాతో అవి కూడా అర్ధం చేసుకొని ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదగడం ఖాయం.

Unfolding the gracious first look of Sai Pallavi from Shyam Singha Roy

విశ్లేషణ: నాని నుంచి చాన్నాళ్ల తర్వాత వచ్చిన కొత్త సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఆధునికత అద్దిన ఒక చక్కని, స్వచ్చమైన ప్రేమకథ. నటులుగా నాని, సాయిపల్లవిలను ఒక మెట్టు ఎక్కించిన సినిమా, దర్శకుడిగా రాహుల్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా. ప్రేక్షకులకు తప్పకుండా ఒక వైవిధ్యమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అయితే.. భారీ బడ్జెట్, ఏపీ టికెట్ రేట్స్ ను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు కమర్షియల్ గా ఎంతవరకు సేఫ్ అవుతుంది అనేది మాత్రం అంచనా వేయడం కాస్త కష్టం. సినిమా పరంగా చిన్నపాటి పొరపాట్లు ఉన్నా.. నాని కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సొ, క్రిస్మస్ వీకెండ్ కి హ్యాపీగా చూసేయోచ్చన్నమాట.

రేటింగ్: 2.5/5

Share.