కరోనా ప్రభావం సామాన్యులపైనే కాదు.. సెలబ్రిటీలపై కూడా పడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ చిన్న పొరపాటు వలన వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనాతో ఇబ్బంది పడ్డారు. రీసెంట్ నటుడు రాజశేఖర్ కుటుంబం మొత్తానికి వైరస్ సోకింది. ఈ విషయంపై మాట్లాడిన రాజశేఖర్ తన కూతుళ్లు శివాని, శివాత్మిక కోలుకున్నట్లు తెలిపారు. తాను జీవిత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూతురు శివాత్మిక వెల్లడించింది. తన తండ్రి త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటూ.. అభిమానులందరిని ప్రార్థన చేయమని కోరింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.
”కోవిడ్‌తో నాన్నా పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినప్పటికీ ఆయన ధైర్యంగా కరోనాతో పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, అభిమానం ఆయన్ని రక్షిస్తాయని బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ ప్రేమ, అభిమానాలతో ఆయన త్వరగానే కోలుకొని బయటకు వస్తారు” అంటూ శివాత్మిక రాసుకొచ్చింది.