హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా కొనసాగుతూనే, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొనసాగుతున్నారు సుమంత్. రెండు రకాల పాత్రలతో విజయాలు సాధిస్తూ వెళ్తున్నారు. అలా ‘అనగనగా’ అంటూ తో ఇటీవల మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా దర్శకుడు సన్నీ సంజయ్‌తో కలసి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అందులో తన కెరీర్ గురించి కొన్ని అంశాలు ఉంటే.. మరికొన్ని అంశాలు టాలీవుడ్ ప్రముఖ హీరోలు, దర్శకుల గురించి ఉన్నాయి.
బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పిన సుమంత్.. కొన్ని రోజుల క్రితమే మహేశ్ బాబును కలిశానని చెప్పాడు. మహేష్ – రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అని కూడా చెప్పాడు. నాగార్జున 100వ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన ఆయన మేనల్లుడు వెంకటేశ్ తన రోల్ మోడల్ అని తెలిపాడు. ‘దేవర’ సినిమా చూశాక తారక్‌కి ఫోన్ చేసి మాట్లాడానని చెపపాడు. రానా చాలా స్వీట్ పర్సన్ అని తరచూ మాట్లాడుకుంటాం అని కూడా చెప్పాడు.
‘అర్జున్ రెడ్డి’ విషయంలో ఈర్ష్యగా ఉంటుందని, తన ఫేవరెట్ సినిమాల్లో అదొకటి అని చెప్పాడు. ఇక దుల్కర్ సల్మాన్ మంచి మనిషని, మా ఇద్దరికీ కార్లంటే ఇష్టమని కామన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాడు. రాజమౌళి గురించి మాట్లాడుతూ హాలీవుడ్‌ని మించి సినిమాలు చేయగలరని పొగిడేశాడు. అలాగే పూరి జగన్నాథ్ పాడ్‌కాస్ట్‌లు చాలా ఇష్టమని చెప్పాడు.
సినిమా నేపథ్యం ఉన్న వారిని ఇండస్ట్రీలో ఆడిషన్ చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘‘ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి ఇండస్ట్రీలోకి ప్రవేశించడం తేలికే గానీ అది కొంత వరకే హెల్ప్ అవుతుంది. ఓ స్థాయి దాటాక ఎవరైనా సినిమా కోసం ఆడిషన్ ఇవ్వాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం బాలీవుడ్‌లో ఎదురైన అనుభవం గురించి కూడా చెప్పాడు. నాలుగైదు హిందీ సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వగా.. అవి రిజెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చాడు సుమంత్. హిందీ భాషపై అంతగా పట్టులేకపోవడం వల్లే ఆ సినిమాల నుండి తనను తిరస్కరించి ఉంటారని అనుకుంటున్నాను అని కూడా చెప్పాడు సుమంత్.