ప్రముఖ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు న్యాయ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణా హైకోర్ట్ నుండి ఆయనకు తాజాగా నోటీసులు అందాయి. ఓ భూమికి సంబంధించిన వివాదంలో రాఘవేంద్రరావుకు నోటీసులు వచ్చినట్టు సమాచారం. ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌కు ఇచ్చిన భూమిని ఆయన సొంత అవసరాలు వాడుకున్నారనే ఆరోపణలు ఆయన ఫేస్ చేస్తున్నారు. సినీ పరిశ్రమ కోసం ఇస్తే… రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
పిల్‌పై విచారించిన న్యాయస్థానం రాఘవేంద్ర రావుకు, ఆయన బంధువులకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలోని షేక్‌పేటలో గతంలో రాఘవేంద్రరావుకు ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది. ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చేయడం కోసం ఆ భూమిని ఇచ్చారు. అయితే డెవలప్ మెంట్ కోసం కాకుండా తన సొంత అవసరాల కోసం ఆ భూమి వాడుకున్నారని ఆరోపణ. ఈ పిటిషన్‌పై కోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసినా, అవి వారికి అందినట్లుగా రికార్డుల్లో లేదు. దీంతో మరోసారి గురువారం నోటీసులు ఇచ్చింది.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. నగరంలోని సర్వే నెం.403/1లోని రెండు ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదుదారు బాలకిషన్ పిల్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి ఈ మేరకు హైకోర్టు నోటీసులిచ్చింది.
మరి దీనిపై రాఘవేంద్రరావు (Raghavendra Rao) ఎలా స్పందిస్తారు, ఏం చెబుతారు అనేది చూడాలి. గతంలోనూ కొంతమంది ప్రముఖుల విషయంలో ఇలాంటి కేసులు వచ్చాయి. ఇక రాఘవేంద్రరావు మీద వచ్చిన పిల్ కూడా 11ఏళ్ల క్రితంది కావడం గమనార్హం. రాఘవేంద్రరావు ప్రస్తుతం దర్శకత్వానికి కాస్త దూరంగా ఉన్నారు. అయితే సమర్పకుడిగా కొన్ని సినిమాలు చేస్తున్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!