యంగ్ హీరో.. అందులోనూ హీరోగా చేసిన ఒక్కగానొక సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు రెండో సినిమాను రిలీజ్‌కి రెడీ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అతనిపై భారీ బడ్జెట్ ఆలోచన జరుగుతోంది. ఆ బడ్జెట్ ఎంతో తెలిస్తే.. మీరు కూడా అవునా.. నిజమా అనేలా మాట్లాడతారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు రూ.100 కోట్లు అని చెబుతున్నారు. యస్.. మీరు చదివింది నిజమే. రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టి రోషన్‌తో (Roshan) ఓ సినిమాను టాలీవుడ్‌లో ప్లాన్ చేస్తున్నారట.
రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. అంతకుముందు బాలనటుడిగా కొన్ని సినిమాలు చేశాడనుకోండి. అయితే ‘పెళ్లి సందD’ సినిమా సాధించిన విజయం, పేరు అంతా శ్రీలీల క్యాష్ చేసుకొంది. అలా అని ఆ సినిమా రోషన్ నటన, లుక్ బాలేదా అంటే బాగా కుదిరాయి. కానీ అలా అయిపోయిందంటే. ఇప్పుడు ‘ఛాంపియన్’గా ఈ నెల 25న రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ గురించే ఇప్పుడు చర్చంతా.
స్వప్న దత్ నిర్మాణంలో రోషన్ (Roshan) మరో సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వినిపిస్తున్న టాక్. దాని కోసం ఓ కథ కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఇది కాకుండా శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ ఓ సినిమా చేయొచ్చని సమాచారం. ఈ సినిమాకు నాగవంశీ ఓ నిర్మాతగా ఉంటారని చెబుతున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా రోషన్ కోసం ఓ కథ రెడీ చేశారట. ఈ సినిమా బడ్జెట్టే రూ.100 కోట్లు ఉంటుంది అని చెబుతున్నారు.
సినిమ కథ, నేపథ్యం, కాస్టింగ్ పాడింగ్, రిలీజ్ ఇలా అన్నీ భారీగానే ఉండబోతున్నాయని.. అందుకే అంత ఖర్చవుతుంది అని అంటున్నారు. అయితే రోషన్ (Roshan) మీద ఇప్పటికిప్పుడు రూ.100 కోట్ల పందెం అంటో రిస్కే అని చెప్పాలి. చూద్దాం ‘ఛాంపియన్’ సినిమా ఫలితం మీదే అన్ని లెక్కలూ ఆధారపడి ఉన్నాయి.