సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగి పోతున్నాయి. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల కాక ముందే తెలుగు శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయాయి. అనేక ఛానళ్ల వారితో పోటీపడి జీ గ్రూప్ వారు అత్యధిక రేటుకి సొంతం చేసుకున్నారు. తెలుగు, హిందీ(డబ్బింగ్) శాటిలైట్ హక్కుల కోసం ఈ సంస్థ 26.5 కోట్లు చెల్లించింది.
ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా ఇంత ధర పలకలేదు. ఈ రికార్డును మహేష్ బాబు సాధించారు. దీనికి సంబంధించిన ఒప్పందం రెండు రోజుల క్రితం పూర్తి అయిందని చిత్ర బృందం వెల్లడించింది. సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత పది రోజులుగా హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై జరుగుతోంది. ఈ ఒక్క ఛేజింగ్ సీన్ కోసం మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలవనుంది. ఇక్కడి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చిత్ర యూనిట్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కి పయనం కానుంది. అక్కడే ప్రిన్స్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, విలన్ ఎస్.జె.సూర్యలపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.