దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన “బాహుబలి: బిగినింగ్” ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలక్షన్స్ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ 800 కోట్లను వసూళ్లు చేస్తుందని జక్కన్న మీడియాకు స్పష్టం చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పోరాట విన్యాసాలు, అనుష్క అందం, రానా, సత్యరాజ్ నటన, అద్భుతమైన వీఎఫ్ఎక్స్, కీరవాణి సంగీతం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు నిండిన ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది.
పైగా శుక్రవారం రాజమౌళి చెప్పిన మాటలకు డిస్టిబ్యూటర్లలో నమ్మకం పెరిగింది. దీంతో థియేటర్ల హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పెరిగింది. కేవలం ఒక అమెరికా హక్కులకోసమే ఓ సంస్థ 40 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. బాహుబలిని వారికే ఇస్తున్నట్లు సంతకాలు కూడా జరిగిపోయాయని సమాచారం. ఒక తెలుగు సినిమాకు ఇంత మొత్తంలో ధర పలకడం ఇదే తొలిసారి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదల కానుంది.