మలయాళంలో ‘ప్రేమమ్’ లాంటి హిట్టు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది అనుపమ. ఆ తరువాత ఆమెకి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ టాప్ రేంజ్ కి చేరుకుంది. ఒకానొక సమయంలో తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ మధ్యలో ఆమె జోరు తగ్గింది. కెరీర్ లో కాస్త గ్యాప్ కూడా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ ముగిసిందనే ఫీలింగ్ వచ్చేసింది. కానీ 2022లో ఆమె బాగానే బౌన్స్ బ్యాక్ అయింది.
‘కార్తికేయ2’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం నిఖిల్ కి వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు కొత్త సినిమా ’18 పేజెస్’లో మాత్రం అనుపమ మెస్మరైజ్ చేసింది. సుకుమార్ అందించిన కథతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే నడిపించారు. సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు తడబడ్డారు. హీరో నిఖిల్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
మిగిలిన తారలు కూడా ఆకట్టుకున్నారు. కానీ వీళ్లందరినీ మించి ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం అనుపమ అనే చెప్పాలి. ఈ పాత్రను చాలా తక్కువమంది మాత్రమే చేయగలరు అనిపించేలా నందిని పాత్రలో ఆమె నటించింది. పాత్రకు తగ్గట్లుగా సింపుల్ మేకప్ తో.. ట్రెడిషనల్ గా కనిపిస్తూ యూత్ ను ఆకట్టుకుంది. నటన విషయంలో కూడా ఆకట్టుకుంది.
ఈ పాత్రతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాలో చనిపోయిందనుకున్న అనుపమ పాత్ర బ్రతికే ఉందని తెలిసినప్పుడు థియేటర్లలో వస్తోన్న రెస్పాన్స్ చూస్తే.. ప్రేక్షకులు ఆ పాత్రకు ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్ధమవుతుంది. ఈ సినిమాతో అనుపమ కెరీర్ మళ్లీ జోరందుకుంటుందేమో చూడాలి!