రాహుల్ రవీంద్రన్-రష్మీ మీనన్ జంటగా 2014లో ప్రారంభమైన చిత్రం “హైద్రాబాద్ లవ్ స్టోరీ”. రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత రెండేళ్లుగా విడుదల కోసం తంటాలు పడుతూ ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 23) విడుదలయ్యింది. అసలే హిట్లు లేక ఉనికిని చాటుకోవడం కోసం నానా ఇబ్బందులుపడుతున్న రాహుల్ రవీంద్రన్ కెరీర్ కి ఈ చిత్రం ఏమేరకు ఉపయోగపడుతుందో చూద్దాం..!!
కథ : కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) మెట్రో రైల్ ప్రొజెక్ట్ ను డీల్ చేసే సివిల్ ఇంజనీర్. ఒక యాక్సిడెంట్ లో భాగ్యలక్ష్మి (రష్మీ మీనన్)ను చూసి ప్రేమిస్తాడు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన కలిగి, ప్రపోజ్ చేసుకొనేలోపు కథలోకి ఎంటరవుతుంది కార్తీక్ ఎక్స్ లవర్ వైష్ణవి (జియా). కార్తీక్ ని ప్రపోజ్ చేసి అతడ్ని పెళ్లి చేసుకోవాలనుకొంటున్న భాగ్యలక్ష్మికి కార్తీక్ గురించి ఒక నమ్మలేని నిజం చెబుతుంది. వైష్ణవి చెప్పిన విషయం నిజమేనని క్లారిఫై చేసుకొన్న భాగ్యలక్ష్మి అప్పట్నుంచి కార్తీక్ ని దూరం పెడుతుంది. విషయం అర్ధం కాని కార్తీక్ మాత్రం భాగ్యలక్ష్మితో మాట్లాడడానికి విఫలయత్నాలు చేస్తుంటాడు. ఇంతకీ కార్తీక్ గురించి భాగ్యలక్ష్మికి తెలిసిన నిజం ఏమిటి? చివరికి కార్తీక్-భాగ్యలక్ష్మి కలిశారా, లేదా? అనేది సినిమాలోని కీలకాంశం.
నటీనటుల పనితీరు : ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం సినిమా అని హీరో రాహుల్ రవీంద్రన్ లుక్, పర్సనాలిటీ విషయంలోనే తెలిసిపోతుంది. అప్పటికి మనోడికి డైలాగ్ డెలివరీ మీదున్న పట్టు ఎక్స్ ప్రెషన్స్ విషయంలో లేకపోవడంతో సినిమా మొత్తం సన్నివేశంలోని ఎమోషన్ తో సంబంధం లేకుండా తన ఫార్మాట్ ఎక్స్ ప్రెషన్స్ తో కానిచ్చేస్తుంటాడు. హీరోయిన్ గా నటించిన రష్మీ మీనన్ సినిమా మొత్తంలో నటించడం కంటే.. నిద్ర మత్తులో తూలడమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అమ్మడు “మైండ్ దొబ్బింది” అన్నట్లుగా ఇచ్చే ఎక్స్ ప్రెషన్ కి ప్రేక్షకుడికి కూడా అదే ఫీల్ కలుగుతుంది.
మరో కథానాయికగా నటించిన జియా సినిమాకి కాస్త గ్లామర్ డోస్, X ఫ్యాక్టర్ ను జోడించడానికి ప్రయత్నించినా వర్కవుట్ అవ్వలేదు. రావు రమేష్ సినిమాలో ఎందుకున్నాడనేది పెద్ద ప్రశ్న. ఆయన పాత్రకి కంటిన్యూటీ ఉండదు.. క్లారిటీ అంతకంటే ఉండదు. ఇక మేల్కొటే-శ్రీనివాస్ ల కాంబినేషన్ లో క్రియేట్ చేసిన కామెడీ, కంపెనీ ఓనర్ గా శ్రీనివాస్ కామెడీ ఎపిసోడ్స్ చూసి నవ్వడం పక్కనుంచి.. చిరాకుపడకుండా ఉండడం కష్టం.
సాంకేతికవర్గం పనితీరు : సునీల్ కశ్యప్ సంగీతం 2015, జనవరి 10న ఆన్ లైన్ లో విడుదలయ్యే టైమ్ కి ట్యూన్స్ ఫ్రెష్ గా ఉండి ఉండొచ్చు కానీ.. ఈ మూడేళ్లలో ఆ తరహా పాటలు వందల కొద్దీ వచ్చి ఉండడంతో పాటలు పెద్దగా అలరించలేకపోయాయి. నేపధ్య సంగీతం మాత్రం రిపీటెడ్ గా అనిపించింది. ఎం.ఆర్.వర్మ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమా మొత్తానికి ఫ్రెష్ గా చూడ్డానికి కాస్త బాగుంది. అయితే.. ఆయన కెమెరా వర్క్ కూడా పేలవమైన కథ-కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది.
2014లో తెరకెక్కిన చిత్రమని హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యే టైమ్ కి అర్ధమైపోతుంది. అతను మెట్రో రైల్ ప్రొజెక్ట్ ను డీల్ చేయడం, ప్రస్తుతం వర్కింగ్ లో ఉన్న మెట్రో స్టేషన్స్ కోసం హీరో స్కెచ్ డిజైన్ చేస్తుండడం వంటి వాటి వల్ల సినిమా మీద కనీస అవగాహన కూడా లేని ప్రేక్షకులకు కూడా సినిమా ఎంత ఓల్డ్ అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. పోనీ సినిమా రిలీజవ్వడం డైరెక్టర్ చేతిలో ఉండదు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే.. రాసుకొన్న కథ మొదలుకొని ఆ కథను నడిపిన తీరు, కథలోని కీలకమైన ట్విస్టులను డీల్ చేసిన విధానం చూస్తే “అసలు ఏమనుకొని సినిమా తీశారు?” అనే ప్రశ్న బుర్రని బద్దలుగొట్టుకొని మరీ బయటకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. అసలు సంబంధం లేకుండా పుట్టుకొచ్చే సన్నివేశాలేమిటో? ఆ గే ఎపిసోడ్ ఎందుకో? కితకితలతో డాక్టర్లు సైతం నయం చేయలేకపోయిన జబ్బుకి ట్రీట్ మెంట్ ఇవ్వడం ఏమిటో? ఇలా చెప్పుకొంటూపోతే బోలెడన్ని అర్ధం పర్ధం లేని లాజిక్కులు, అసందర్భమైన సన్నివేశాల కలగలుపు గంప లాంటి చిత్రమే “హైద్రాబాద్ లవ్ స్టోరీ”.
విశ్లేషణ : రాహుల్ రవీంద్రన్ కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు కానీ.. “హైద్రాబాద్ లవ్ స్టోరీ” మాత్రం టాప్ లిస్ట్ లో నిలుస్తుంది. పాపం రాహుల్ రవీంద్రన్ హీరోగా సినిమాలు తగ్గించి దర్శకుడిగా ఎందుకు మారాడు అనే విషయం కూడా ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. సొ, సినిమా గురించి ఇక ప్రత్యేకంగా చూడాలా వద్దా అని చెప్పక్కర్లేదనుకుంటా.
రేటింగ్ : 0.5/5