టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున (Nagarjuna) ఒకరు కాగా ఈ హీరోకు భారీ షాక్ తగిలింది. హైడ్రా బృందం అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తోంది. భారీ బందోబస్తు మధ్య మాదాపూర్ లో అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారని సమాచారం అందుతోంది. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారని సమాచారం అందుతోంది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్( హైడ్రా) గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారుల విచారణలో ఎన్ కన్వెన్షన్ ను నిర్మించిన స్థలం ఆక్రమిత స్థలం అని తేలిందని భోగట్టా. స్థలాన్ని ఆక్రమించారని పక్కా ఆధారాలు లభించిన నేపథ్యంలో అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూల్చివేతకు ఉపక్రమించారని భోగట్టా.
చెరువులను ఆక్రమించి కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ కొన్నిరోజుల క్రితం ప్రకటన చేశారు. కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తుండగా నాగ్ కు చెందిన ఎన్ కన్వెన్షన్ పై అధికారులు చర్యలకు దిగడం హాట్ టాపిక్ అవుతోంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత గురించి నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసే దిశగా అడుగులు పడ్డాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం విషయంలో నాగార్జున అభిమానులు మాత్రం ఫీలవుతున్నారు.