ఎందుకు హరికృష్ణ అలా మాట్లాడారో నాకు తెలియదు : పరుచూరి గోపాలకృష్ణ

మహానటుడు నందమూరి తారకరామారావు నటించిన ఎన్నో సినిమాలకు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కథలను, మాటలను అందించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ తో పాటు, అతని పిల్లలైనా హరికృష్ణ, బాలకృష్ణలతో మంచి స్నేహం ఉంది. అయితే ఆగస్టు 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ లోకం విడిచి వెళ్లిపోయారు. అతని మరణ వార్త విని పరుచూరి గోపాలకృష్ణ చాల బాధపడ్డారు. ఆ బాధనుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అతను .. హరికృష్ణ తనతో మాట్లాడిన చివరి మాటలను గుర్తుచేసుకున్నారు. “ఆగస్టు 27వ తేదీన ఉదయం నేను హరికృష్ణకు ఫోన్ చేశాను. ‘నాన్నా, మా అల్లుడు .. కూతురు మీ ఇంటికొచ్చి శుభలేఖ ఇచ్చారు చూశావా?’ అని అడిగాను. ‘చూడలేదు .. ఎవరిది పెళ్లి?’ అని అడిగాడు. ‘నా మనవరాలి పెళ్లి .. ఆగస్టు 30వ తేదీన నువ్వొచ్చి అక్షింతలు వేస్తే .. అన్నగారే వచ్చి అక్షింతలు వేసినట్టుగా భావిస్తాను’ అన్నాను.

‘సారీ రాలేను’ .. 29 ఉదయాన్నే ఊరికి వెళుతున్నాను .. 30 పొద్దున్నే రాగలుగుతానో లేదో నాకు తెలియదు కదా’ అన్నాడు. ‘పోనీ ఒక పనిచేయి హరి .. 31వ తేదీన ఉదయం ‘సత్యనారాయణ స్వామి వ్రతం’ ఉంది… అప్పుడైనా వచ్చి వధూవరులకు అక్షితలు వేయి’ అన్నాను. ‘అప్పుడు కూడా ‘రాలేను’ అనే అన్నారు. ‘రాలేను’ అనే మాట నేను తన నోటివెంట వినడం అదే మొదటిసారి. అయితే ఈ రోజు (ఆగస్టు 27వ తేదీ) ఉదయం 11 గంటల 30 నిమిషాలకి నా మనవరాలిని పెళ్లి కూతురుని చేస్తారు .. అప్పుడు వచ్చి అక్షితలు వేయి’ అని అడిగాను. అయితే ఆ రోజున నేను బయటికి వెళ్లినప్పుడు హరికృష్ణ వచ్చి నా మనవరాలికి అక్షింతలు వేశారు. ఆయన వచ్చినట్టు తెలిసి నేను ఫోన్ చేసి రెండు నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పాను. అప్పుడు ఆయన ‘టైమ్ లేదు వెళ్లిపోతున్నాను’ అని అన్నాడు. ఎందుకు ఆ భగవంతుడు ఆయనతో అలా మాట్లాడించాడో .. ఎందుకిలా జరిగిందో అసలు అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus