ఐ హేట్ హారర్ మూవీస్ : తాప్సీ

కెరీర్ తొలినాళ్లలో రెగ్యులర్ అండ్ రొటీన్ హీరోయిన్ లా వరుసబెట్టి కమర్షియల్ సినిమాలు, గ్లామర్ రోల్స్ చేసుకుంటూ వెళ్ళిన తాప్సీ అనంతర కాలంలో కాస్తంత నిదానించి కమర్షియల్ అంశాలతోపాటు కాస్త లాజిక్ ఉన్న సినిమాలు కూడా చేస్తూ కెరీర్ ను బ్యాలెన్స్ చేయడం మొదలెట్టింది. “పింక్” సినిమాతో నటిగా తనను తాను పతాక స్థాయిలో ప్రూవ్ చేసుకొంది. అప్పట్నుంచి చాలా సెలక్టడ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్న తాప్సీ తెలుగులో తాజాగా నటించిన సినిమా “ఆనందో బ్రహ్మ”. మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ రేపు (ఆగస్ట్ 18) విడుదలకానుంది. ఈ సందర్భంగా తాప్సీ సినిమా గురించి తన కెరీర్ గురించి మీడియాతో పంచుకొంది. ఆ విశేషాలు మీకోసం..!!

అయిదు నిమిషాల్లో ఒప్పుకున్న స్టోరీ ఇది.. అప్పటికే “గంగ” అనే హారర్ సినిమాలో నటించి ఉన్నాను, ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి ఉండడంతో మళ్ళీ మరో హారర్ సినిమా చేయడం అవసరమా అనిపించింది. కానీ.. మహి చెప్పిన కథ విన్న అయిదు నిమిషాల్లోనే ఒకే చెప్పేశాను. అలాగని ఇదేదో ఆస్కార్ రేంజ్ సినిమా కాదు, కాకపోతే క్యారెక్టరైజేషన్స్, కాన్సెప్ట్ కొత్తవి. అవి నచ్చబట్టే ఈ సినిమా ఒప్పుకొన్నాను.

మహి థాట్ ప్రోసెస్ ప్లస్ అవుతుంది.. బేసిక్ గా మా డైరెక్టర్ మహికి దైవం=దెయ్యంపై నమ్మకం లేదు, అందువల్ల రెగ్యులర్ హారర్ సినిమాలకి భిన్నంగా “ఆనందో బ్రహ్మ” సినిమాని తెరకెక్కించాడు. ఇప్పటివరకూ సౌత్ లో ఇలాంటి హారర్ సినిమా ఎవరూ చూసి ఉండరు. నేను నా బాలీవుడ్ ఫ్రెండ్స్ కి ఈ కాన్సెప్ట్ చెప్పినా కూడా అందరూ షాక్ అవుతున్నారు.

నేను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిన మొట్టమొదటి సినిమా ఇది.. ఇప్పటివరకూ నేను తెలుగు-తమిళం-హిందీ భాషల్లో చాలా సినిమాలు చేశాను. ఏవో కొన్ని తప్పితే మాగ్జిమమ్ మూవీస్ కి సంబంధించిన ఎలాంటి విషయాల్లోనూ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను. కానీ.. మొదటిసారి “ఆనందో బ్రహ్మ” షూటింగ్ మొదలుకొని ప్రమోషన్ వరకూ ప్రతి విషయంలోనూ నేను ఇన్వాల్వ్ అయ్యాను, ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది వంటి అన్నీ మేటర్స్ లోనూ నేను ఇన్వాల్వ్ అయ్యాను. కరెక్ట్ గా చెప్పాలంటే నేను ఓన్ చేసుకొని మరీ యాక్ట్ చేసి, రేపు జనాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తారా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఏకైక సినిమా ఇది.

నాది చాలా రొటీన్ రోల్.. చాలారోజుల తర్వాత నేను తెలుగులో సెలక్ట్ చేసుకొన్న రోల్ కావడంతో.. ఇదేదో అద్భుతమైన చిత్రమనో, నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందనో ఎక్స్ ఫెక్ట్ చేసి థియేటర్ కి వస్తే మాత్రం మోసపోతారు. ఈ తరహా పాత్రలు ఇదివరకే చాలామంది చేసి ఉంటారు, ఇప్పటికీ చాలా రోల్స్ వచ్చాయి కూడా. అయితే.. ఇది రెగ్యులర్ సినిమాలకు కాస్తంత భిన్నంగా ఉంటుంది అంతే తేడా.

వాళ్ళ వైకల్యమే సినిమాలో ఎంటర్ టైన్మెంట్.. సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్ ఇలా ప్రతి ఒక్కరికీ విధమైన అంగ వైకల్యం ఉంటుంది. అయితే.. ఆ వైకల్యం వారిని దెయ్యాలంటే భయపడకుండా ఎలా చేసింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అది చాలా హిలేరియస్ గా ఉంటుంది.

ప్రతి సినిమాలోనూ నటించేయలేం.. అన్నీ సినిమాల్లోనూ పెర్మార్మ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. కొన్ని కమర్షియల్ సినిమాలుంటాయి, ఇంకొన్ని టిపికల్ కమర్షియల్ సినిమాలుంటాయి. సో, ప్రతి సినిమాలోనూ మన పెర్మార్మెన్స్ చూపించాలి అనుకొంటే కాస్త కష్టమే. దొరికిన పాత్రకు న్యాయం చేయాలన్నదే నా కోరిక.

నేను స్టార్నని నేనే అనుకోను.. నేనేదో పెద్ద స్టార్ హీరోయిన్ ని అన్న ఫీలింగ్ నాకే ఉండదు, సో నేను నటించే సినిమాలు నా స్టార్ డమ్ ని కాదు నాలో ఉన్న నటిని సంతృప్తిపరిచేలా ఉండాలి. అంతే తప్ప నేనేదో పెద్ద స్టార్ హీరోయిన్ ని అనే విషయాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అడ్డమైన సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, రాకూడదనే అనుకొంటున్నాను.

నన్ను సరిగా వాడుకోలేకపోయానని బాధపడ్డాడు.. నా ప్రీవీయస్ హిందీ మూవీ “నామ్ షబానా” చూసిన తర్వాత మా డైరెక్టర్ మహి “నీలో ఇంత అద్భుతమైన నటి ఉందా, నేను నిన్ను నా సినిమాలో సరిగా వాడుకోలేదు” అంటూ తెగ బాధపడిపోయాడు.

అందరూ అనుకొంటున్నట్లు అది ఫ్లాప్ సినిమా కాదు.. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమా “నామ్ షబానా”. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం యాక్చువల్ బడ్జెట్ కి పదింతలు సంపాదించిపెట్టింది. ఆ విషయం తెలియని చాలా మంది ఇది ఫాప్ సినిమా అనుకొంటారు.

ఒక స్పోర్ట్స్ బయోపిక్ లో నటించాలని ఉంది.. ప్రస్తుతం బయోపిక్స్ కాలం నడుస్తోంది. నాక్కూడా ఒక బయోపిక్ లో నటించాలని ఉంది, నాకు పర్టీక్యూలర్ గా ఒక డ్రీమ్ రోల్ అనేది ఏం లేదు కానీ.. ఒక స్పోర్ట్స్ బయోపిక్ లో నటించాలని మాత్రం ఉంది.

పెళ్లాయాక కూడా నటిస్తాను.. ఒక అయిదేళ్లకు ముందు “పెళ్ళెప్పుడు, పెళ్లాయ్యాక నటిస్తారా” అని ఎవరైనా అడిగితే ఏవేవో చెప్పేదాన్ని. కానీ.. ఇప్పుడు నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడూ పాత్రల పరిధులు మారుతున్నాయి. అందుకే.. పెళ్లయ్యాక కూడా నటించాలని ఫిక్స్ అయిపోయా. ఇంకో విషయం ఏంటంటే.. ఇంకో మూడునాలుగేళ్లవరకూ పెళ్లి చేసుకొనే ఆలోచన కూడా లేదు.

Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus