Krishna: కృష్ణగారి ఫ్యామిలీ గురించి రామారావు గారి మాటల్లో?

ఇటీవల ప్రముఖ సినీ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల గారు మరణించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈమె రెండవ భార్య. వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు. ప్రతీ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యేవారు. ఇప్పటికీ వారెంతో సంతోషంగా గడుపుతున్న తరుణంలో ఇలా విజయనిర్మల గారు దూరమవ్వడం కృష్ణ గారికి చాలా బాదాకరమైన విషయమనే చెప్పాలి. ఇదిలా ఉండగా కృష్ణ గారి మొదటి భార్య ఇందిర గారు ఉండగా విజయ నిర్మల గారిని ఎలా పెళ్ళి చేసుకున్నారు. విజయ నిర్మల గారిని పెళ్ళి చేసుకున్నాక మొదటి భార్యతో ఆయన రిలేషన్ ఎలా ఉండేది.. అనేటువంటి విషయాలు చాలా మందికి తెలీదు. వీటి గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపారు సీనియర్ జర్నలిస్ట్.. అలాగే కృష్ణ ఫ్యామిలీని మొదటినుండీ దగ్గరగా ఉంటూ వచ్చిన ఇమంది రామారావు గారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “కృష్ణగారు మొదట ఆయన మరదలు అయిన ఇందిరా దేవి గారిని 1961లో వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం అది. పెళ్ళి తర్వాత ‘సాక్షి’ సినిమా ద్వారా విజయ నిర్మలతో కృష్ణ గారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1969లో రహస్యంగా కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో… వీరిద్దరూ తిరుపతిలో పెళ్ళి చేసుకున్నారు. కృష్ణ గారిని ఆయన ఇద్దరు భార్యలు చాలా సిన్సియర్ గా ప్రేమించారు. అందుకే ఎలాంటి గొడవలు రాలేదు. విజయ నిర్మల గారిని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఇందిర గారికి ఎలాంటి లోటు రాకుండా కృష్ణ గారు చూసుకున్నారు. రెండవ పెళ్ళైన తర్వాత కూడా ఇందిర గారి ద్వారా కృష్ణ గారు తండ్రి అయ్యారు. తన భర్త పై ఉన్న ప్రేమతో ఆయన ప్రేమను ఇందిర గారు గౌరవించారు.

అందుకే ఆయన రెండవ పెళ్ళి చేసుకున్న సమయంలో గొడవ చేయలేదు. కుటుంబ సభ్యులు కొందరు కృష్ణగారిని తప్పుబట్టే ప్రయత్నం చేయబోయినప్పటికీ.. ‘ఆయన ఏం తప్పు చేయలేదని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు కనుక ఆయన్ను ఎవరూ ఏమనొద్దంటూ’ కృష్ణ గారికి ఇందిరా మద్దతుగా నిలిచిన సందర్బాలు చాలా ఉన్నాయి. మరో వైపు విజయ నిర్మల గారు కూడా కృష్ణ గారిని పెళ్ళి చేసుకున్నా ఆయన మొదటి ఫ్యామిలీకి ఎటువంటి సమస్య రాకుండా.. తనకు మాట రాకుండా జాగ్రత్త పడ్డారు. కృష్ణ గారి కూతుర్లు, కొడుకులతో విజయ నిర్మల చాలా అన్యూన్యంగా ఉండే వారు. ముఖ్యంగా మహేష్ బాబు పై చాలా ఆప్యాయత చూపించేవారు.

కృష్ణ గారి కంటే కూడా మహేష్ మంచి నటుడు అంటూ విజయ నిర్మల గారు చెప్పిన సందర్బాలే ఎక్కువ. ఇక మహేష్ బాబు అందగాడు అంటూ విజయ నిర్మల గారు మహేష్ సినిమా వేడుకల్లో చెప్పేవారు. ‘మహర్షి’ వరకూ కూడా మహేష్ బాబు నటించిన సినిమాలను కృష్ణగారితో కలిసి చూస్తూ వచ్చారు. మహేష్ లాంటి బిడ్డ ఉండాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలని కూడ చెప్పేవారు. విజయ నిర్మల కొడుకయిన నరేష్ మొదట్లో అస్సలు తల్లి మాట వినేవాడు కాదు. ఇష్టమొచ్చినట్టు వ్యవహరించేవాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని తల్లి చెప్పినట్లుగా విని.. ఆమెకు చివరి వరకు కూడా తోడుగా ఉండి మంచి కొడుకు అనిపించుకున్నాడు. అమ్మపై ప్రేమతో తన పేరులో విజయను చేర్చుకున్నాడు నరేష్. కృష్ణ గారిని కూడా నరేష్ ఎంతో గౌరవించాడు. తండ్రి సమానంగా ప్రతి విషయంలో కూడా చూసుకునే వాడు. కృష్ణ గారు కూడా నరేష్ ను కొడుకులా చూసుకునేవారు” అంటూ కృష్ణ, విజయనిర్మల దంపతుల గురించి ఎవరికీ తెలియని విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus