చిరంజీవి ప్రశంస ఉత్సాహాన్ని ఎంతగా నింపుతుందో, అంతకుమించి బాధ్యతను పెంచుతుంది. మెగా ఫ్యామిలీతో పని చేసే దర్శకులు చాలామంది ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఇదే మాట అంటున్నారు. సినిమా విడుదల తేదీ (ఈ నెల 12) దగ్గర పడుతున్న కొద్దీ ప్రెజర్ పెరుగుతోందని చెప్పుకొచ్చాడు. దీని వల్ల సరిగ్గా నిద్ర పోవడం లేదట, భోజనం కూడా చేయబుద్ధి వేయడం లేదట. వీలైనంత త్వరగా ఈ నెల 12 తన జీవితం నుంచి వెళ్లిపోతే బాగుండు అనుకుంటున్నాడట. ‘ఉప్పెన’ను ఇప్పటికే ఓ వందమంది వరకు చూశారట. అందరి నుంచి మంచి స్పందనే వచ్చిందని చెప్పాడీ యువ దర్శకుడు.
దర్శకుడు సుకుమార్‌కు ఉన్న అతి కొద్ది మంది శిష్యుల్లో బుచ్చిబాబు ఒకరనే విషయం తెలిసిందే. ఈ విషయం సుకుమారే తెలుసు. అందులో మనసుకు దగ్గరైన వారిలో బుచ్చిబాబు ఉన్నాడు. అదే విధంగా బుచ్చిబాబుకు కూడా సుకుమార్ అంటే ప్రాణం. ఆ అభిమానం చూసి సొంతూరైన పిఠాపురంలో అందరూ బుచ్చిబాబును సుకుమార్ అని పిలిచేవారట. సుకుమార్ లాంటి గురువు తనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తాను అని చెప్పిన బుచ్చిబాబు, ‘పుష్ప’ కోసం గురువుతో పని చేయాలని కోరుకుంటున్నాడు. బుచ్చిబాబుగా కాకుండా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబుగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
వైష్ణవ్ తేజ్ పాత్రను రూపొందించడానికి తన ప్రాంతంలోని స్నేహితుల నుంచి స్ఫూర్తి పొందాడట. వారిని బాగా పరిశీలించి అశీ పాత్ర రాసుకున్నాడట. ‘ఉప్పెన’ సాధారణ సినిమాలా కనిపించినా… చాలా కొత్తగా అనిపిస్తుందని, సినిమా కొచ్చే ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ తప్పక అందిస్తామని చెప్పాడు బుచ్చిబాబు. చూద్దాం రేపు ఏ విషయమో తెలిసిపోతుందిగా. ఈ లోగా ఆల్‌ది బెస్ట్ బుచ్చిబాబు సానా.