ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ సినిమాకు అందించిన సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగాను 2024కి ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈనెల 22న గుజరాత్‌లోని కేవడియాలో జరగబోయే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.
అనంత్ నాగ్ దక్షిణ కన్నడ జిల్లా చిత్రాపూర్‌లో ఆనంది, సదానంద నాగరకట్టె దంపతులకు సెప్టెంబరు 4, 1948న పుట్టారు. అక్కడి ఆనంద్ ఆశ్రమం, ఉత్తర కన్నడలోని చిత్రాపూర్ మఠంలో వేదపాఠాలు చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం ముంబయికి వెళ్లిన ఆయనకు అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. తన సోదరుడితో కలసి కన్నడ, కొంకణిలో నాటకాల్లో నటించారు. ఈ క్రమంలో సత్యదేవ్ దూబె, గిరీశ్ కర్నాడ్, అమోల్ పాలేకర్‌తో పరిచయం ఏర్పడింది.
1973లో కన్నడ సినిమా ‘సంకల్ప’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ కన్నడ చిత్రం ఏడు రాష్ట్ర అవార్డులు కొల్లగొట్టింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, మరాఠి, మలయాళ, ఇంగ్లిష్ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘మంథన్’, ‘కొండుర’, ‘కల్‌యుగ్’ తదితర సినిమాల్లో అనంత్ నాగ్ కీలక పాత్రలో నటించారు. ఆర్‌కే నారాయణ్ కథల ఆధారంగా తెరకెక్కించిన టీవీ సీరియల్ ‘మాల్గుడి డేస్’లో మిఠాయివాలా పాత్రలో మరపురాని ప్రదర్శన ఇచ్చారు.
‘బయలుదారి’, ‘కన్నేశ్వర రామ’, ‘గోది బణ్ణ సాధారణ మైకట్టు’, ‘రాజకుమార’, ‘గాలిపట – 2’, ‘కేజీయఫ్’ తదితర సినిమాలతో అదిరిపోయే పాత్రలు చేశారు. తెలుగులో ‘ప్రేమలేఖలు’, ‘అనుగ్రహం’, ‘భీష్మ’, ‘బాలు’, ‘శంఖారావం’ తదితర సినిమాల్లో నటించారు. ఇలా సినిమాల ద్వారా వెండితెర మీదే కాదు కర్ణాటక రాజకీయాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. మల్లేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు.
2025లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డు కూడా ఇచ్చింది. ‘మించిన ఓట’ సినిమాతో తొలిసారి కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్ అవార్డు దక్కించుకున్నారు. డాక్టర్ విష్ణువర్ధన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. 2007లో కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం దక్కింది.
అనంత్‌నాగ్ రాజకీయాల్లోనూ రాణించారు. జేడీఎస్ పార్టీ తరఫున విధానపరిషత్తు, విధానసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత క్రమంగా ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఆయన భార్య గాయత్రి కన్నడ చిత్రాల్లో నటించారు. తమ్ముడు శంకర్‌నాగ్, ఆయన సతీమణి అరుంధతి కన్నడ నాట నటులుగా గుర్తింపు పొందారు.