ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ మృతి విషయంలో నెటిజన్ల నుంచి, ఆయన సన్నిహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్ కారు యాక్సిడెంట్ అయిన సమయంలో డ్రైవింగ్ సీట్ లో ఉన్న సురేష్ కత్తి మహేష్ డ్రైవర్ అని చాలామంది భావించారు. అయితే సురేష్ కత్తి మహేష్ డ్రైవర్ కాదని ఆయన బిజినెస్ పార్టనర్ అని సమాచారం.
సురేష్, కత్తి మహేష్ కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని అనుకున్నారని చిత్తూరు జిల్లాలోని ఉదయ మాణిక్యం విలేజ్ లో మైనింగ్ లీజు చేయాలని భావించారని తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావాల్సి ఉంది. ఎన్ఓసీ కోసం గ్రామసభ పెట్టాలని ఎంపీడీవో కోరగా గ్రామసభ కోసం వెళుతున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని సురేష్ చెప్పుకొచ్చారు. యాక్సిడెంట్ అయిన సమయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తాను సేవ్ అయ్యానని సురేష్ వెల్లడించారు.
కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, కత్తి మహేష్ కూర్చున్న వైపు ఒకటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో పాటు ఆ ఎయిర్ బ్యాగ్ కూడా కత్తి మహేష్ ను బలంగా ఢీ కొట్టి పగిలిపోయిందని సురేష్ అన్నారు. కత్తి మహేష్ ను చెన్నై తీసుకెళ్లిన తర్వాత కోలుకున్నాడని అయితే లంగ్స్ ఇన్ఫెక్షన్ తో కత్తి మహేష్ చనిపోయారని డాక్టర్లు చెప్పారని సురేష్ అన్నారు. కత్తి మహేష్ మరణవార్త విని తాము షాకయ్యామని సురేష్ చెప్పుకొచ్చారు.