ఇంట్లో దెయ్యం నాకేం భయం

  • December 30, 2016 / 02:53 PM IST

ఈమధ్యకాలంలో టాలెంట్, టైమింగ్, బ్యాగ్రౌండ్ అన్నీ ఉండి కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోలేక వరుస ఫ్లాప్ లతో కథానాయకుల రేస్ లో వెనుకబడ్డ నటుడు అల్లరి నరేష్. “సుడిగాడు” అల్లరి నరేష్ కెరీర్ లో లాస్ట్ హిట్, ఆ తర్వాత నరేష్ నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి బాక్సాఫీసు వద్ద బోల్తాకొడుతూ వచ్చాయి. ఈ ఏడాది చివర్లో అయినా హిట్ కొట్టాలన్న ధృడ నిశ్చయంతో.. తనకు “సీమ శాస్త్రి” లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం “ఇంట్లో దెయ్యం నాకేం భయం”. మరి తుగ్లక్ తరహాలో అల్లరోడు వరుసబెట్టి చేస్తున్న దండయాత్రల తరహాలో చేస్తున్న ఈ తాజా దండయాత్రైనా అతగాడికి సత్ఫలితాన్నిచ్చిందో లేదో చూద్దాం..!!

కథ : నరేష్ (అల్లరి నరేష్) పెళ్లిళ్లలో బ్యాండ్ మేళం వాయిస్తుంటాడు. తాను ప్రేమించిన ఇందుమతి (కృతిక) పెంచుకొంటున్న అనాధ బాలికకు గుండె ఆపరేషన్ కోసం ఒక రౌడీ దగ్గర తన స్నేహితుడు శంకర్ (షకలక శంకర్) కిడ్నీలు తాకట్టు పెట్టి మూడు లక్షలు అప్పు తీసుకొంటాడు. అయితే.. డబ్బు తీసుకొని గేటు దాటగానే పిక్ పాకెటర్స్ ఆ డబ్బును దొంగిలించడంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో గోపాల్రావ్ (రాజేంద్రప్రసాద్) ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వెళ్లగొట్టే “భూత వైద్యులు”గా ప్రవేశిస్తారు. అయితే.. ఆ దెయ్యం అక్కడికి వచ్చింది ఎందుకో తెలుసుకొని షాక్ అవుతారు.
అసలా దెయ్యం ఎవరు, ఎవరి కోసం వచ్చింది, ఆ దెయ్యం లక్ష్యం ఏమిటి వంటి అంశాలకు ఏమాత్రం ఆసక్తిలేని కథనంతో చెప్పిన సమాధానాల సమాహారమే “ఇంట్లో దెయ్యం నాకేం భయం” చిత్రం.

నటీనటుల పనితీరు : భయపడుతూ కామెడీ పండించడం అనే కాన్సెప్ట్ లో ఇన్వాల్వ్ అయిపోయి నటించడం అల్లరి నరేష్ కు కొత్తకాకపోవడంతో ఎప్పట్లానే ఎనర్జీతో పాత్రలోకి దూరిపోయాడు. అయితే.. కథలో, కథనంలోనూ పట్టులేకపోవడంతో అతడు నవ్వించాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

షకలక శంకర్, చమ్మక్ చంద్రలు కామెడీ చేయాలని చేసిన వెకిలి చేష్టలు చిరాకు తెప్పించడం మినహా చేసిందేమీ లేదు. ముఖ్యంగా దెయ్యం దగ్గర టన్నులు తినే సన్నివేశం, క్లైమాక్స్ లో దెయ్యంతో ఆడే ఆటలు థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ను పారిపోయేలా చేస్తాయి.
ఇక హీరోయిన్లు కృతిక, మౌర్యానీలు హీరోకి ముద్దులు పెట్టడానికి, చెరో రెండు పాటల్లో హీరోతో కలిసి డ్యాన్సులు చేస్తూ అంగాంగ ప్రదర్శనలు చేయడం తప్పితే తమ నట విశ్వరూపం చూపడానికి ఆస్కారం లభించలేదు. రాజేంద్రప్రసాద్ సీనియారిటీ ఉన్న బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు. ఇంకా బోలెడు మంది సీనియర్ నటీనటులు వెండితెరను నింపడానికి మినహా పెద్దగా ఉపయోగపడలేదు.

సాంకేతికవర్గం పనితీరు : సాయికార్తీక్ తన పాత ట్యూన్స్ ను దుమ్ముదులిపి మళ్ళీ రివర్స్ లో వాయించేశాడనిపిస్తుంది. ఇక హారర్ సినిమాకు చాలా కీలకమైన నేపధ్య సంగీతం అయితే ప్రేక్షకులకు హారర్ ఫీల్ ను కలిగించడం పక్కన పెడితే.. వారిని పడరాని పాట్లకు గురి చేసింది. సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద మైనస్. ఫ్లై కామ్ షాట్స్ లో ఎక్కడా క్లారిటీ లేదు, పైగా డి.ఐ మరీ హేయంగా ఉండడంతో సినిమానా, షార్ట్ ఫిలిమా అనే మీమాంసలో పడిపోతాడు ప్రేక్షకుడు. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ వంటి సాంకేతిక పరమైన అంశాలన్నీ దారుణంగా విఫలమయ్యాయి.

దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి రాసుకొన్న కథలో కొత్తదనం, కథనంలో ఆసక్తి కలిగించే అంశాలు లోపించాయి. ఆ కారణంగా సినిమా మొత్తానికి కనీసం అరగంట కూడా ప్రేక్షకుడు థియేటర్ లో కుదురుగా కూర్చోలేకపోయాడు. ఇక దెయ్యం పగ తీర్చుకొనే సీన్లు మరీ వెటకారంగా సగటు ప్రేక్షకుడు ఎంత లాజిక్ పట్టించుకోకపోయినా జీర్ణించుకొనే స్థాయిలో లేకపోవడంతో అవి చూడడానికి చాలా ఇబ్బందిపడతాడు. ఇక తాను ప్రేమించిన వ్యక్తిని చంపి అతడ్ని తనతోపాటు పరలోకానికి తీసుకుపోతానంటూ దెయ్యం పాత్రధారి చేసే హంగామా అయితే అప్పటివరకూ సహనంతో సినిమా చూస్తున్న ప్రేక్షకుడి నెత్తిన గుడిబండలా మారింది. సో, డైరెక్టర్ గానే కాక కథకుడిగానూ నాగేశ్వర్రెడ్డి దారుణంగా విఫలమైన చిత్రం “ఇంట్లో దెయ్యం నాకేం భయం”.

విశ్లేషణ : సినిమా చూపించి అందులోని హారర్ ఎలిమెంట్స్ ద్వారా ప్రేక్షకుల్ని భయపెట్టడం వేరు, సినిమా చూడ్డానికే భయపడేలా చేయడం వేరు. “ఇంట్లో దెయ్యం నాకేం భయం” ఈ రెండో రకానికి చెందిన సినిమా. 135 నిమిషాల నిడివిగల ఈ సినిమా చూస్తున్నంతసేపూ “థియేటర్ లో నుంచి ఎప్పుడు పారిపోదామా” అని ఆడియన్స్ అనుక్షణం మనసులో అనుకొనేలా చేసిన సినిమా “ఇంట్లో దెయ్యం నాకేం భయం”.

రేటింగ్ : 1.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus