Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ – ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురి మధ్య ఓ బంతాట జరుగుతోందా? ఏమో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. బన్నీ – త్రివిక్రమ్‌ సినిమా అని తొలుత ప్రకటించి.. ఆ తర్వాత కాదు కాదు తారక్‌ – త్రివిక్రమ్‌ అని అన్నారు. ఇప్పుడు తూచ్‌ తూచ్‌ తిరిగి అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్ అనబోతున్నారు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అంటే మొన్నామధ్య తారక్‌ చేతిలో కనిపించిన ‘కార్తికేయ’ పుస్తకం.. ఇప్పుడు తిరిగి బన్నీ చేతిలోకి వెళ్లబోతోంది అని చెబుతున్నారు.

Allu Arjun

కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఓ మైథ‌లాజిక‌ల్ క‌థని సిద్ధం చేశారు. కార్తికేయుని జీవితాన్ని అందులో చూపిస్తారు అని వార్తలొచ్చాయి. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా తర్వాత ఈ సినిమా మొదలవుతుంది అని చెప్పారు. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌లేదు. అట్లీ సినిమాను బన్నీ స్టార్ట్‌ చేసేశాడు. అదే సమయంలో ఆ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రకు వెళ్లింది. ప్ర‌శాంత్ నీల్ సినిమా ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌) ముగిసిన వెంట‌నే, త్రివిక్రమ్‌ సినిమా మొద‌లైపోతుంద‌ని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ లోపు వెంకటేశ్‌ సినిమాను త్రివిక్రమ్‌ పూర్తి చేసేస్తారు అని అన్నారు.

కానీ ఇప్పుడు చూస్తే.. తిరిగి బన్నీ దగ్గరకే కార్తికేయుని కథ వచ్చిందట. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ మీద కొత్త సంవత్సరంలో అనౌన్స్‌ అవ్వబోతున్న పెద్ద సినిమా ఇదే అని అంటున్నారు. అయితే గతంలో వద్దనుకుని ఎవరి దారి వారు చూసుకున్న బన్నీ – త్రివిక్రమ్‌ ఇప్పుడు మళ్లీ అదే కథతో కలుస్తున్నారా? లేక కొత్త కథ ఏదైనా అనుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కార్తికేయుని కథే అయితే.. రీసెంట్‌ టైమ్స్‌లో తారక్‌ చేతికొచ్చి బయటకు వెళ్లిపోయిన రెండో కథ అవుతుందిది.

రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తొలుత చెప్పింది తారక్‌కే. అంతా ఓకే అనుకొని టైటిల్‌ని కూడా లీక్‌ చేశారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా చరణ్‌కి చేరింది. మరిప్పుడు ‘కార్తికేయ’ కథ ఎందుకు తారక్‌ను వీడుతుందో నిర్మాత నాగవంశీనే చెప్పాలి. అయితే ఎప్పటిలా త్రివిక్రమ్‌ ఏమంటే మేమూ అదే అనే సమాధానం రావొచ్చు.

సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus