భాషను గౌరవించడం అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన రూల్. అ బేసిక్ రూల్ ను ఈమధ్య తమిళ నిర్మాతలు ఖాతరు చేయడం లేదు. తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే.. ఇదివరకు తెలుగు డబ్బింగ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే మంచి టైటిల్ పెట్టేవారు. “గజిని, బాహుబలి (Baahubali) ” లాంటి కామన్ టైటిల్ తప్పితే దాదాపుగా భాషకు తగ్గట్లే టైటిల్ ను మార్చేవారు దర్శకనిర్మాతలు.
కానీ.. ఈమధ్య తమిళ సినిమాలను తమిళ టైటిల్ తోనే తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ ఒరవడి మొదలుపెట్టింది అజిత్ (Ajith). అజిత్ హీరోగా రూపొందిన “వలిమై”ను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలను తమిళ టైటిల్ తోనే రిలీజ్ చేసారు. సూర్య (Suriya) తాజా చిత్రం “కంగువ” (Kanguva) కూడా తమిళ టైటిల్ తోనే అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ (Rajinikanth) కూడా అదే జాబితాలో చేరిపోవడం బాధాకరం.
ఆయన (Rajinikanth) తాజా చిత్రం “వేట్టయన్”ను తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. “వేట్టయన్” (Vettaiyan) అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. మరి ఇలా కనీస తెలుగు టైటిల్ మార్చకుండా భాషను అవమానపరచడం అనేది రజనీకాంత్ నుండి ఊహించలేదు. అక్టోబర్ 10న విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. అయితే తమిళంలో నిర్వహించినట్లుగా తెలుగులో ఈవెంట్ ఏమీ ప్లాన్ చేయట్లేదు. మరి ఏదైనా సింపుల్ ప్రెస్ మీట్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.