ఆయనో స్టార్ డైరెక్టర్, అతనో స్టార్ ప్రొడ్యూసర్. ఇద్దరూ కలిసి ఒక క్రేజీ కాంబినేషన్ లో మాంచి మాస్ సినిమా తీశారు. ఆ సినిమా అందరూ ఊహించినట్లుగానే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందనుకోండి. సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది పక్కన పెడితే.. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీ వర్గాలు, జనాలు, సినిమా అభిమానులు ఆ డైరెక్టర్ ను పర్సనల్ గా టార్గెట్ చేసి చాలా ఇబ్బందిపెట్టారు. మొదట్లో ఆ టార్గెటింగ్ ను పెద్దగా పట్టించుకోని ఆ డైరెక్టర్ లైట్ తీసుకొన్నప్పటికీ.. పరిస్థితి కాస్త శ్రుతి మించడంతో వేరే దారి లేక దిద్దుబాటు చర్యలు మొదలెట్టాడు.
కానీ.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు, అసలే సినిమా రిజల్ట్ పుణ్యమా అని వస్తున్న ట్రోలింగ్ కు తట్టుకోలేకపోతున్న ఆ డైరెక్టర్ పర్సనల్ లైఫ్ ను తెరమీదకు తీసుకొచ్చారు. ఆయన తన గర్ల్ ఫ్రెండ్ ను ఫారిన్ లొకేషన్ లో జరుగుతున్న షూటింగ్ స్పాట్ కు తీసుకురావడం కోసమే పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశాడని, దానివల్ల నిర్మాతకి దాదాపు కోటి రూపాయల నష్టం వాటిల్లిందని, ఆ విషయం సదరు నిర్మాతకు రీసెంట్ గా తెలిసిందని, ఇకపోతే.. ఇటీవలే ఆ డైరెక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ ను నిర్మాతగానూ మార్చేశాడని ఒక ఆంగ్ల పత్రిక ప్రత్యేకమైన కథనం ప్రచురించింది. ఆ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పాల్సిన అవసరం లేకపోయినా.. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరా అని చర్చలు మాత్రం మొదలయ్యాయి. మరి ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? ఆమె నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా ఏమిటా అని అందరూ చర్చించుకుంటున్నారు.