Samantha Ruth : సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా కెరీర్ ప్రారంభం నుంచే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్లలో సమంత ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్ లలో మాత్రమే కాదు… పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న సమంత, ఇటీవల సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రొడక్షన్ రంగంలోనూ తన సత్తా చాటుతోంది.
ఇక కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ, సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2026లో తాను ఏం చేయాలనుకుంటున్నదీ అభిమానులతో షేర్ చేస్తూ ఆమె షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. సుదీర్ఘమైన, అర్థవంతమైన బంధాలను ఏర్పరచుకోవడం, నిరంతరం కష్టపడి పనిచేస్తూ వ్యక్తిగతంగా-వృత్తిపరంగా ఎదగడం, సమాజానికి తిరిగి ఇవ్వడం, అలాగే ఆత్మపరిశీలనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం తన లక్ష్యాలుగా సమంత పేర్కొన్నారు. ఈ మాటలు చూస్తే, ఆమె 2026ని కేవలం కెరీర్ పరంగానే కాకుండా జీవిత పరంగా కూడా ఒక మైలురాయిగా మార్చుకోవాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది.

ఇప్పటికే ఆరోగ్య సమస్యల నుంచి కోలుకొని, మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన సమంత… భవిష్యత్‌లో మరింత బలమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని సిద్ధమవుతోంది. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న సమంత, తాజాగా దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానులను ఉద్దేశిస్తూ చివర్లో “మీ 2026 లక్ష్యం ఏంటి?” అంటూ పోస్ట్ చేసింది.
