థ్రిల్లర్… ఈ జోనర్‌ను ఎంచుకోవడానికి కొంతమంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ముందుకురారు. అందులోనూ వెన్నులో చలి పుట్టించే థ్రిల్లర్లు అంటే ఇంకా కష్టం. కమర్షియల్ సినిమాల విజయం రుచి అలవాటుపడిన వారు ఇంకా ముందుకు రారు. కానీ ఈ బేరియర్‌ను దాటుకు వచ్చేవాళ్లు ఊహించని విజయాలు అందుకుంటారు. అలా థ్రిల్లర్ జోనర్‌ను ఇటీవల ఎంచుకున్న చాలా టాలీవుడ్ సినిమాలు, నటులు భారీ విజయాలు అందుకుంటున్నారు. దీంతో ఆ జోనర్ ఇప్పుడు హిట్ మంత్రగా మారిపోయింది.
టాలీవుడ్ అనే కాదు… ఏ సినీ పరిశ్రమలో (Tollywood) అమినా ఒక జోనర్‌లో సినిమా విజయం సాధించిందంటే.. ఇక అదే స్టైల్‌లో వరుసగా సినిమాలు వస్తుంటాయి. అనుకొని చేస్తారో, అనుకోకుండా వస్తాయో కానీ… అలా వచ్చేస్తుంటాయి అంతే. అలా ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా క్లిక్ అవుతున్న జోనర్ మిస్టరీ థ్రిల్లరే. మనకు బాగా తెలిసిన జోనర్ అయిన హారర్ కథలను విభిన్నంగా ప్రెజెంట్ చేస్తూ ఈ సినిమాలు చేసి విజయాలు సాధిస్తున్నారు.
గత ఏడాది కన్నడ నాట తెరకెక్కి పాన్ ఇండియా సినిమాగ మారింది ‘కాంతార’. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీని నుండి స్ఫూర్తి పొందిన మన దర్శకులు అలాంటి థ్రిల్లర్ జోనర్ కథలను డీల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వేసవిలో వచ్చిన ‘విరూపాక్ష’ సినిమా ఇలాంటిదే. విజయం కూడా భారీగానే దక్కింది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద హిట్‌గా నిలిచింది కూడా.
ఆ సినిమా ఏ రేంజి హిట్ అంటే… ప్రస్తుతం దానికి సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మొన్నీమధ్యే ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా వచ్చింది. తొలి పార్టుకు మించిన విజయం ఈ సినిమా అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ రెడీ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ‘మంగళవారం’ సినిమా సైతం ఇదే జోనర్‌లో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పిస్తోంది. పకడ్బందీగా కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్న అజయ్ భూపతి సినిమాతో ఆకట్టుకున్నారు. వరుసగా ఈ జోనర్ సినిమాలు విజయం సాధిస్తుండటంతో సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’ను త్వరగా తెచ్చేయాలని అనుకుంటున్నారట.