మా రక్తంలోనే ఉంది

అక్క ప్రియాంక చోప్రా బాటలో నడుస్తూ.. హిందీ చిత్రసీమలో కథానాయికగా ప్రవేశించింది పరిణీతి చోప్రా. ప్రియాంక నటి మాత్రమే కాదు, మంచి గాయని కూడా. తాజాగా పరిణీతి కూడా పాడుతోంది. ఏడాది విరామం తర్వాత పరిణీతి నటిస్తున్న చిత్రం ‘మేరి ప్యారీ బిందు’. ఇందులో ‘మాన కె హమ్ యార్ నహిన్..’ పాటను స్వయంగా ఆలపిస్తుంది. మొదటిసారి పాడిన అనుభవం ఎలా ఉందని ప్రశ్నించగా.. పాట మా రక్తంలోనే ఉందని చెప్పింది. ఈ పాట గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. “నేను పాడుతున్నానని తెలియగా..

మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఎగ్జయిటయ్యారు. మేము పాడతామని అందరికీ తెలుసు. పాట మా రక్తంలోనే ఉందని నా అభిప్రాయం. అందువల్ల మాలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. చివరకు, ప్రొఫెషనల్ సింగర్ అయ్యాను” అని తెలిపింది. ‘మేరి ప్యారీ బిందు’లో గాయని కావాలని కలలు కనే అమ్మాయి పాత్రలో పరిణీతి నటిస్తుంది. నటించినవి తక్కువ చిత్రాలే అయినప్పటికీ.. తన వ్యాఖ్యల కారణంగా తరచూ వార్తల్లో కనిపిస్తుందీ అమ్మాయి. ప్రియాంక చిత్రాల్లో పాటలతో పాటు ‘ఇన్ మై సిటీ..’, ‘ఎగ్జోటికా..’ వంటి సింగిల్స్ కూడా పాడింది. పరిణీతికి కూడా అటువంటి ఆలోచన ఉందా? అని అడగ్గా.. “లేదండీ. ప్రస్తుతానికి చిత్రాల్లో పాటలు మాత్రమే పాడతాను. భవిష్యత్తులో సింగిల్స్, మ్యూజిక్ వీడియోలు గురించి ఆలోచిద్దామ”ని చెప్పింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus