జగమే తంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 18, 2021 / 10:18 PM IST

ధనుష్-కార్తీక్ సుబ్బరాజుల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “జగమే తంత్రం”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాద రూపంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. “ఆకాశమే నీ హద్దురా” అనంతరం తమిళ పరిశ్రమ నుండి ఒటీటీలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాకి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: తమిళనాడు పాపులర్ రౌడీ సురుళి (ధనుష్) ఊర్లో జరిగిన ఒక గొడవ కారణంగా నెల రోజులు ఊరు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో సురుళిని వెతుక్కుంటూ లండన్ నుంచి వస్తారు పీటర్ & గ్యాంగ్. వారానికి రెండు లక్షల పౌండ్ల జీతానికి అక్కడికి వెళతాడు. అక్కడ పీటర్ & గ్యాంగ్ కి అడ్డంకిగా ఉన్న శివదాస్ & టీం ను చంపడమే సురుళి గోల్. ఈ క్రమంలో సురుళి ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? పీటర్ వెర్సస్ శివదాస్ ల యుద్ధంలో సురుళి పావుగా మిగిలిపోయాడా? లేక రాజుగా నిలిచాడా? అనేది “జగమే తంత్రం” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: శివదాస్ గా నటించిన మలయాళ నటుడు జోజు జార్జ్ సినిమాకి మంచి ఎస్సెట్ గా నిలిచాడు. ధనుష్ స్క్రీన్ ప్రెజన్స్ ను తట్టుకొని నిలబడడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది జోజు తన పర్సనాలిటీతోనే మేనేజ్ చేసేశాడు. ధనుష్ ఎప్పట్లానే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఐశ్వర్య లేక్ష్మి, దీపక్ పరమేష్, శరత్ రవి క్యారెక్టర్స్ ని జస్టిఫై చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. నెట్ ఫ్లిక్స్ వెర్షన్ లో పాటలు కట్ చేయడం వల్ల ఇప్పుడు పాటల్ని ఆడియో పరంగా మాత్రమే విశ్లేషించగలం. అవన్నీ ఆల్రెడీ సూపర్ హిట్. కానీ వాటి ప్లేస్ మెంట్ ఏంటి అనేది టీవీ ప్రీమియర్ లో చూసి తెలుసుకోవాలి. అయితే.. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం తన కెరీర్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ప్రతి క్యారెక్టర్ కి, సీన్ మూడ్ కి తగ్గట్లుగా రెట్రో & మోడ్రన్ ట్యూన్స్ తో సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, డి.ఐ, ఆడియోగ్రఫీ సినిమాలోని స్టైల్ ను బాగా ఎలివేట్ చేశాయి.

ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే.. అతడి కెరీర్ లో తీసిన బ్యాడ్ ఫిలిమ్ గా “జగమే తంత్రం” మిగిలిపోతుంది. కార్తీక్ సుబ్బరాజ్ మునుపటి చిత్రం “పెట్ట”కే సరైన రెస్పాన్స్ రాలేదు. కాకపోతే రజనీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే స్టఫ్ పుష్కలంగా ఉండడంతో కంటెంట్ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. “జగమే తంత్రం” విషయంలోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు కార్తీక్. కథ-స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ స్టడీ వంటి విషయాలకు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కేవలం స్టైలిష్ మేకింగ్ ను మాత్రమే నమ్ముకున్నాడు. కథనంలో “పోకిరి, నాయకుడు” లాంటి సినిమాలు కనిపిస్తుంటాయి. ధనుష్ అనే వ్యక్తి పాదరసం లాంటోడు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు.

అలాంటి నటుడ్ని అది కూడా “అసురన్, కర్ణన్” లాంటి సినిమాల తర్వాత ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో ప్రెజంట్ చేశాడు కానీ.. థీమ్ మాత్రం ఆ రెండు సినిమాల వలే ఉండడం పెద్ద మైనస్. కొన్ని సినిమాలు సరైన క్యాస్టింగ్ లేకపోవడం ఫ్లాపావుతుంటాయి, కొన్నిటికి అవసరానికి తగ్గ బడ్జెట్ లేక. ఇంకొన్ని అన్నీ ఉన్నా డైరెక్టర్ కి సరైన విజన్ లేక ఫ్లాపావుతుంటాయి. “జగమే తంత్రం” ఈ ఆఖరి జాబితాలో చేరే చిత్రం. పా.రంజిత్ కథకి కార్తీక్ సుబ్బరాజ్ కొరియేగ్రఫీ చేసినట్లుగా ఉంటుందీ చిత్రం. సొ, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు తన మార్క్ ను ప్రూవ్ చేసుకోలేకపోవడమే కాక, తనను నమ్మిన హీరో, ప్రొడ్యూసర్ ను ముంచాడు.

విశ్లేషణ: టీజర్ & ట్రైలర్ కంటెంట్ చూసి.. ఏదో ఉంటుంది అనుకోని చూస్తే మాత్రం భీభత్సంగా నిరాశ చెందడం ఖాయం. అయితే.. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మాత్రం సినిమా మేకింగ్ స్టైల్ & సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ధనుష్ ఫ్యాన్స్ & కార్తీక్ సుబ్బరాజు ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఓ “అజ్ణాతవాసి”.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus