ఏడాదిన్నర క్రితం ఓ చిన్న సినిమాగా, చిన్నపాటి ఆశలు ఉన్న సినిమాగా వచ్చి ఎవరూ ఊహించని విజయం అందుకుంది. తెలుగు సినిమా ప్రతిభను దేశవ్యాప్తం అవ్వడానికి సాయపడిన సినిమాల్లో అదీ ఒకటి. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఆ సినిమా పెద్ద సినిమాలకు పోటీగా దీటుగా నిలబడి అదిరిపోయే వసూళ్లును అందుకుంది. అలాంటి సినిమా సీక్వెల్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అనుకున్నట్లుగా అంచనాలు వచ్చాయి. చాలా కాలం ఉన్నాయి. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలవ్వకపోయేసరికి చప్పబడ్డాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా అప్‌డేట్ వచ్చింది.
భారీ విజయం అందుకున్న సినిమా ‘హను – మాన్’ అయితే.. ఆ సినిమాకు అనౌన్స్ అయిన సీక్వెల్ ‘జై హనుమాన్’. ‘హను – మాన్’ సినిమా క్లైమాక్స్‌లోనే ‘జై హనుమాన్’ను అనౌన్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఆ తర్వాత చాలా నెలలు ఆ సినిమా ఊసు లేదు. ఈలోపు ఆయన నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా పనుల్లో పడ్డారు. ఆ సినిమాయేమో ముహూర్తం ముందే ఆగిపోయింది (ఇప్పటికి అదే సమాచారం). దీంతో ‘బ్రహ్మరాక్షస’ అంటూ రణ్‌వీర్ సింగ్, ప్రభాస్ చుట్టూ తిరుగుతున్నారు.
దీంతో ‘జై హనుమాన్’ కూడా ఆగిపోయిందా అనే డౌట్ చాలామందికి కలిగింది. కానీ ఆ సినిమా హీరో రిషభ్ శెట్టి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సినిమా అప్‌డేట్ కూడా ఇచ్చారు. నా తదుపరి చిత్రం… ‘జై హనుమాన్’ అని ప్రకటించేశారు. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని కూడా చెప్పారు. అయితే ఈ అప్‌డేట్ డైరక్టర్ నుండి కాకుండా హీరో నుండి రావడం కాస్త ఆశ్చర్యపరిచే విషయం.
ప్రభాస్‌తో ‘బ్రహ్మరాక్షస’ చేస్తారని ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ అనుకుంటుంటే.. మధ్యలో ఇప్పుడు ‘జై హనుమాన్’ వచ్చింది. చూడాలి మరి ఏ సినిమా తొలుత ప్రారంభమవుతుందో?