ఓ రూ. 17 కోట్లు బడ్జెట్ పెట్టి రూ.450 కోట్లు రాబట్టిన సినిమాకు సీక్వెల్ / ప్రీక్వెల్ వస్తోంది అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో చెప్పండి. అన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌లో వచ్చిన సినిమా అదే స్థాయిలో విజయం అందుకున్నాక.. దానికి సీక్వెల్ రావాలని, భారీ విజయం అందుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ ఆ సినిమా రావడానికి రెండు, మూడేళ్లు పట్టొచ్చు అని చెబితే ఎలా ఉంటుంది. కచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ‘కాంతార’ ఫ్యాన్స్‌కి ఇదే న్యూస్ చెప్పారు ఆ ఫ్రాంఛైజీ దర్శక హీరో రిషభ్ శెట్టి.
మూడేళ్ల క్రితం వచ్చిన ‘కాంతార’ వసూళ్ల సునామీ గురించి మీకు తెలిసిందే. పైన చెప్పినట్లు రూ.450 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’కి రూ. 650 కోట్లకుపైగా వసూళ్లు వస్తున్నాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటాం. కానీ రిషభ్ శెట్టి మాత్రం ఇంత త్వరగా వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన తన కొత్త సినిమాల గురించి మాట్లాడారు. అలాగే ఎన్టీఆర్‌తో సినిమా గురించి కూడా మాట్లాడాడు.
ఎన్టీఆర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నాకు సోదరుడితో సమానం. మా కుందాపుర అబ్బాయిలాగే కనిపిస్తాడు. ఓసారి ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో ఓసారి సెట్‌కి వచ్చి, మేం సృష్టించిన ఆ ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాడని చెప్పాడు. అలాగే తారక్ – ప్రశాంత్ నీల్ సినిమా (డ్రాగన్)లో తాను నటిస్తున్నాననే ప్రచారం నిజం కాదని తేల్చేశారు. ఇక తన తదుపరి దర్శకత్వ సినిమా రావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు అని తేల్చేశారు.
అలాగే ఆ సినిమా ఏంటనేది కూడా చెప్పలేదు. అంటే ఆ సినిమా ‘కాంతార: చాప్టర్ 2’నా లేక ఇంకొకటా అనేది కూడా చెప్పలేదు. ఈ లెక్కన ‘కాంతార ఫ్రాంచైజీ’లో కొత్త సినిమా ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. ఇక ‘జై హనుమాన్’ సినిమాను వచ్చే జనవరిలో ప్రారంభిస్తామని చెప్పాడు రిషభ్.