యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన జై లవ కుశ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని చిత్ర బృందం సం తోషపడుతుంటే.. పైరసీ మాత్రం విజృంభించి వెక్కిరిస్తోంది. చిత్ర యూనిట్ ఎన్ని పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ జై లవకుశను పైరసీ కోరల్లో చిక్కకుండా చేయలేకపోయారు. కొంతమంది స్మార్ట్ ఫోన్ల సహాయంతో సినిమాలోని హైలెట్ సన్నివేశాలను చిత్రికరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అది నిమిషానికి వేల మందికి చేరి విస్తరిస్తోంది. అర్ధరాత్రి నుంచే వాట్సాప్, ఫేస్ బుక్ లలో జై లవ కుశ ఫైట్స్, పాటలు ప్రత్యక్షమయ్యాయి. సైబర్ టీమ్ వీటిని అరికట్టడానికి కష్టపడుతున్నప్పటికీ కంట్రోల్ కావడంలేదు. ఒక లింక్ ని డిలీట్ చేస్తే పది లింకులు పుట్టుకొస్తున్నాయి.
ఈ వీడియోలను ఆపడం చిత్ర బృందానికి, నిపుణులకు తలనొప్పిగా మారింది. ఇక ఎన్టీఆర్ అభిమానులే కల్పించుకొని పైరసీ వీడియోలను అంతమొందించాల్సి ఉంటుంది. పైరసీ లింకులు ఎక్కడైనా కనిపిస్తే ఈ ఈమెయిల్ కి (Jlkantipiracy@gmail.com) పంపించమని చిత్ర యూనిట్ కోరింది. పైరసీని అడ్డుకోవడంలో భాగస్వాములు కండి.