జంబ లకిడి పంబ

“జంబ లకిడి పంబ” అనగానే అందరికీ ఇమ్మీడియట్ గా ఇవివి గారి సినిమా గుర్తొస్తుంది. 1993లో విడుదలైన ఆ చిత్రం అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. ఇప్పటికీ చాలా సినిమాల్లో ఆ సినిమా రిఫరెన్సులు కనిపిస్తుంటాయి. అంతటి ఘన విజయం సొంతం చేసుకొన్న “జంబ లకిడి పంబ” టైటిల్ తో ఇంచు మించిగా అదే శైలి కథనంతో తెరకెక్కిన చిత్రమే ఈ నవతరం “జంబ లకిడి పంబ”. “గీతాంజలి” చిత్రంతో హీరోగా మారిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి కథానాయకుడీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ:
వరుణ్ (శ్రీనివాసరెడ్డి) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, పల్లవి (సిద్ధి ఇద్నాని) ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇద్దరూ ప్రేమించుకొని.. ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొంటారు. పెళ్లి చేసుకోవడం వరకూ బాగానే ఉంది కానీ.. పెళ్లి తర్వాత అసలు సమస్యలు మొదలవుతాయి. పెళ్ళైన కొన్నాళ్లకే విడాకులకు అప్లై చేస్తారు. తన 100 కేస్ గా వరుణ్-పల్లవిల విడాకుల కేస్ ను టేకప్ చేసిన లాయర్ మోస్ట్ ఫేమర్ లాయర్ (పోసాని కృష్ణమురళి) తన పుట్టినరోజుకు గోవా ట్రిప్ కి వెళ్ళి.. రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. తన భార్యతోపాటు స్వర్గానికి వెళుతుండగా.. 99 మంది జంతాను విడగొట్టిన తాను 100వ కేస్ గా ఒప్పుకొన్న వరుణ్-పల్లవిలను కలిపితేనే స్వర్గలోక ప్రవేశం ఉంటుందని చెబుతాడు ఆ దేవుడు (సుమన్). లాయర్ గా గోవా వెళ్ళి ఆత్మగా తిరిగొచ్చిన పోసాని మాటను పట్టించుకోరు వరుణ్ & పల్లవి. దాంతో వీళ్ళు ఒకర్నొకరు అర్ధం చేసుకోవాలంటే.. ఒకరి శరీరాల్లోకి మరొకరు వెళ్లాలని నిశ్చయించుకొని వరుణ్ శరీరంలోకి పల్లవి ఆత్మను, పల్లవి ఆత్మను వరుణ్ శరీరంలోకి ప్రవేశింపజేస్తాడు పోసాని. అక్కడ్నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఏ తీరానికి చేరింది? అనేది “జంబ లకిడి పంబ” కథాంశం.

నటీనటుల పనితీరు:
సాధారణంగా తన పాత్రల్లో చాలా సహజంగా జీవించే శ్రీనివాసరెడ్డి.. అమ్మాయిలా నటించడం రాకో, కుదరాకో తెలియదు కానీ చాలా ఇబ్బందిగా, అసహజంగా నటించాడు. శ్రీనివాసరెడ్డి ఆడంగి చేష్టలు కామెడీ క్రియేట్ చేయకపోగా, చిరాకు తెప్పించాయి. సినిమాకి మైనస్ లో అమ్మాయిగా శ్రీనివాసరెడ్డి హావభావాలు మొదటి వరుసలో నిలుస్తాయి. ఇక అమ్మాయిగా నటించినంతసేపూ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సిద్ధి ఇద్నాని పరకాయ ప్రవేశం అనంతరం అబ్బాయిలా మాత్రం ఇరగదీసింది. సెకండాఫ్ లో అమ్మడి పెర్ఫార్మెన్స్ హైలైట్ అనుకోవాలి. మ్యానరిజమ్స్, ఎక్స్ ప్రెషన్స్ తో అలరించింది సిద్ధి. పోసాని కృష్ణమురళి పాత్రకి ఒక పర్పస్ ఉన్నప్పటికీ.. సరైన సన్నివేశాలు పడక అంతగా పండలేదు. అలాగే.. వెన్నెల కిషోర్, హరితేజల కామెడీ కూడా పెద్దగా నవ్వించలేకపోయింది. హిమజ మళ్ళీ హీరోయిన్ కంటే బెటర్ గా కనిపించి, నటనతోనూ మెప్పించి తన పాత్రకు న్యాయం చేసింది. ఇక రఘుబాబు, తనికెళ్లభరణి, చిత్రంశ్రీను, సత్యం రాజేష్ వంటి ఆర్టిస్టులు బోలెడుమంది ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన సన్నివేశాలు పడక వారి పాత్రలు పండలేదు.
సాంకేతికవర్గం పనితీరు:
గోపీ సుందర్ సంగీతం బాగుంది కానీ.. పాటల పిక్చరైజేషన్, టైమింగ్, ప్లేస్ మెంట్ కుదరక అలరించలేకపోయాయి. థీమ్ సాంగ్ వినడానికి, చూడ్డానికి కూడా బాగున్నప్పటికీ.. అప్పటికే సినిమా కారణంగా నీరసించిపోయిన ప్రేక్షకుడు ఆ పాటని పెద్దగా పట్టించుకోడు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీలో ఉన్న క్వాలిటీ కథ-కథనాల్లో లేకపోవడంతో ఆయన పడిన కష్టమంతా వృధా అయ్యింది. దర్శకుడు జె.బి.మురళీకృష్ణ ఎంచుకొన్న కాన్సెప్ట్ ఏమీ కొత్తది కాదు. కనీసం కథనమో లేక సన్నివేశాలో ఆసక్తికరంగా రాసుకోవాలి కదా. ఆల్రెడీ “రైట్ రైట్” అనే ఫ్లాప్ సినిమాకి రైటర్ గా వర్క్ చేసిన అనుభవం ఉండి కూడా ప్రేక్షకుల పల్స్ తెలుసుకోలేకపోవడం ఏంటో. సినిమా మొత్తంలో థియేటర్లో మహా అయితే ఓ నాలుగుసార్లు నవ్వులు వినిపించి ఉంటాయి. ఒక కామెడీ ఎంటర్ టైనర్ అని పబ్లిసిటీ చేసి మరీ విడుదలైన ఓ చిత్రానికి ఇంతకంటే అవమానం ఏముంటుంది. ఇదే కాన్సెప్ట్ తో మునుపు వచ్చిన “ఇ ఈ” అనే సినిమా “జంబ లకిడి పంబ” కంటే పదిరేట్లు బెటర్ గా ఉంటుంది. మంచి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు దొరికినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా.. ఈ పిచ్చి ప్రయోగాలేంటో దర్శకుడికే తెలియాలి.
విశ్లేషణ:
శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, పోసాని ఉన్నారు కదా కాసేపు సరదాగా నవ్వుకోవచ్చు అని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల్ని దారుణంగా మోసం చేసి 140 నిమిషాల పాటు వాళ్ళ సహనాన్ని పరీక్షించడంతోపాటు.. మంచి టైటిల్ ను పాడు చేసిన చిత్రం “జంబ లకిడి పంబ”.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus