ఏదైనా సినిమా విడుదలవుతుంటే.. ఈ సినిమా బాగా ఆడితేనే మాకు లైఫ్ అని చెబుతుంటారు మన టాలీవుడ్ జనాలు. ఎందుకంటే టికెట్ తెగితేనే తర్వాతి సినిమాకు డబ్బులు వచ్చేది, అలాగే వాళ్లకు వేరే అవకాశాలు వచ్చేది. అయితే ఇలాంటి మాట ఓ హాలీవుడ్ దర్శకుడు చెబితే.. పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది మేం ఏ సినిమా గురించి చెబుతున్నామో. ఆఁ జేమ్స్ కామెరూన్ గురించే, ఆయన తీస్తున్న ‘అవతార్’ సిరీస్ గురించే.
‘అవతార్ 2’ సినిమా వచ్చే వసూళ్ల ఆధారంగానే ఫ్రాంఛైజీ తర్వాతి చిత్రాలు ఆధారపడి ఉంటాయి అని ఆ మధ్య జేమ్స్ కామెరూన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తమ బృందం చాలా కష్టపడిందని, సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారని.. ఈ సినిమాకు సరైన స్పందన, డబ్బులు రాకపోతే ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ వచ్చే అవకాశాలు తక్కువ అని జేమ్స్ కామెరూన్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ‘అవతార్’ రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వచ్చి అదరగొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్ 2’ రికార్డు వసూళ్లు సాధిస్తుండటంతో త్వరలోనే ఫ్రాంఛైజీ చిత్రాలు పట్టాలెక్కించే యోచనలో ఉన్నట్టు హాలీవుడ్ సమాచారం. ఆదివారం ఒక టీవీ షోలో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ ‘‘అవతార్ 2’కి భారీగా ఖర్చుపెట్టాం. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ఆడుతోంది. ఇదే ఊపుతో సినిమా ఇంకొన్ని రోజులు ఆడితే బ్రేక్‌ఈవెన్ సాధిస్తాం’’ అని చెప్పారు.
‘అవతార్ 2’ తర్వాత ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంది. ఆ పనులు త్వరలోనే ప్రారంభిస్తాను అని కామెరూన్ చెప్పారు. అయితే ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ‘అవతార్ 3’ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘అవతార్ 3’ సినిమా ఎలా ముందుకెళ్లాలనే విషయమై డిస్నీ సంస్థతో మాట్లాడాలి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాం. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా వేగం చేస్తాం అని కామెరూన్ తెలిపారు. ‘అవతార్ 3’ పనులు పూర్తయ్యాకే ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ సినిమాల స్క్రిప్ట్ పని మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు.