రామ్.. టాలీవుడ్‌లో ఓ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. మంచి వినోదం ఉన్న కమర్షియల్ మాస్ కథ పడితే ఆ సినిమా విజయాన్ని ఆపడం ఎవరితరమూ కాదు అనేలా ఆ పాత్రలో జీవించేస్తాడు. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేశాడు. ఇప్పుడు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమాతో తన మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇలా మాస్, వినోదం జోనర్స్ కలగలిపి సినిమాలు చేస్తూ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది?
రామ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ ఒక విధంగా కొత్తదే, మరో విధంగా పాతదే. ఎందుకంటే రచయితగా ఉన్నప్పుడు అనిల్ రావిపూడి.. రామ్ కలసి పని చేశారు. మొత్తంగా మూడు సినిమాల్లో ఈ కాంబినేషన్ కనిపించింది. రామ్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే ఈ ఇద్దరూ కలసి పని చేస్తే బాగుంటుంది అని రామ్ ఫ్యాన్స్, అనిల్ రావిపూడి అభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి కూడా అదే కోరుకుంటున్నారు అనిపిస్తోంది.

రీసెంట్‌గా ఓ టీవీ షోలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ రామ్‌తో సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. రామ్‌తో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, వస్తే బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందేనని అన్నారు అనిల్ రావిపూడి. ఆయన మామూలుగానే బాక్సాఫీసు బద్ధలయ్యే సినిమాలు చేస్తుంటారు. మరింతగా పక్కాగా చెప్పారు అంటే ఏదో బలమైన కథే మనసులోనే, పేపర్ మీదో ఉండి ఉండాలి. అయితే రచయితగా అనిల్ రావిపూడి పని చేసిన సినిమాలు సరైన ఫలితాలే అయితే అందుకోలేదు.

ఇద్దరూ కలసి గతంలో ‘కందిరీగ’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’ సినిమాలు చేశారు. అందులో ‘మసాలా’ ఇబ్బందికర ఫలితం అందుకోగా.. ‘కందిరీగ’, ‘పండగచేస్కో’ సినిమాలు ఫర్వాలేదనిపించాయి. మరిప్పుడు డైరెక్టర్‌గా ఎలాంటి కథ చేస్తారో చూడాలి. ఇదంతా తెలియాలి అంటే ముందు కాంబినేషన్ కుదరాలి.
