ప్రపంచ చలన చిత్ర సీమలో ‘అవతార్’ సృష్టించిన చరిత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమా సృష్టికర్త జేమ్స్ కామెరూన్ గొప్పతనం గురించి సినిమా జనాలు ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. పండోరా గ్రహాన్ని చూపించిన తీరు, కథ, కథనం అన్నీ కట్టిపడేసేలా ఉంటాయి. అయితే అలాంటి జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ డైరక్షన్ నుండి తప్పుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. ‘అవతార్ 2’, ‘అవతార్ 3’ చేశాక ఈ సిరీస్‌ను వదిలేస్తారట.
రెండు, మూడు భాగాలు అయిపోయాక తర్వాత వేరే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అని కామెరూన్ చెప్పారు. ‘అవతార్’ రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఓ కొత్త ప్రాజెక్టు కోసం పని చేయాలనుకుంటున్నా. దీని కోసం ‘అవతార్’లో నా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ‘అవతార్’ నాలుగు, ఐదో భాగాల దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి ఇచ్చేస్తాను’’ అని చెప్పారు కామెరూన్.
‘అవతార్’ నాకెంతో ఇష్టమైన వాతావరణం, ప్రకృతి. దీన్ని నేను కుటుంబంతోనే పోలుస్తాను. అనేక అంశాలపై నా అభిప్రాయం చెప్పడానికి గొంతునిచ్చిన సినిమా ఇది. ‘అవతార్’ నాకు నిజ జీవితంలోనూ వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకం అని కామెరూన్ చెప్పారు. ‘అవతార్ 2’ డిసెంబరు 16న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో విడుదల చేస్తారని టాక్. ఓ సినిమా ఇన్ని భాషల్లో విడుదలవ్వడం ఇదే తొలిసారి అంటున్నారు.
‘అవతార్’కి ఒక సీక్వెల్ కాదు నాలుగు సీక్వెల్స్ ఉంటాయని జేమ్స్ కామెరూన్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు వస్తున్న ‘అవతార్ 2’ కోసం జేమ్స్ 2017 నుండి పని చేస్తున్నారు. కరోనా కష్టాలు, ఇతర పనుల వల్ల సినిమాల ఆసల్యమవుతూ వస్తోంది. ఇక మిగిలిన మూడు సీక్వెల్స్ ఎప్పుడొస్తాయి అన్నదీ ముందే చెప్పేశారు. మొత్తంగా 2028లోపు ఆ సీక్వెల్స్ తెచ్చేయాలనేది ఆలోచనట. ప్రతి సీక్వెల్ డిసెంబరులోనే ఉంటుంది. ‘అవతార్ 3’ని 2024 డిసెంబరు 20న తెస్తారు. నాలుగో ‘అవతార్’ డిసెంబరు 18, 2026లో వస్తుందట. ఇక ఆఖరిదైన ‘అవతార్ 5’ను 22 డిసెంబరు 2028లో విడుదల చేస్తారట.