Jawan Movie Review in Telugu: జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • షారుక్ ఖాన్ (Hero)
  • నయనతార (Heroine)
  • విజయ్ సేతుపతి, ప్రియమణి, సునెల్ గ్రోవర్, శరణ్య మల్హోత్రా తదితరులు.. (Cast)
  • అట్లీ (Director)
  • గౌరీ ఖాన్ - గౌరవ్ వర్మ (Producer)
  • అనిరుధ్ (Music)
  • అట్లీ (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 07, 2023

“పఠాన్” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారుక్ ఖాన్ నుండి వస్తున్న తాజా చిత్రం “జవాన్”. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నయనతార బాలీవుడ్ డెబ్యు చేయడం విశేషం. రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం మధ్యలో షారుక్ కుమారుడు అరెస్ట్ అవ్వడం వల్ల చాన్నాళ్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సీజీ వర్క్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. మొత్తానికి నేడు (సెప్టెంబర్ 07) థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: ముంబైలోని ఓ ఉమెన్స్ జైల్ కి జైలర్ ఆజాద్ (షారుక్ ఖాన్). తన తండ్రి విక్రమ్ రాథోడ్ (షారుక్ ఖాన్)పై దేశ ద్రోహిగా పడిన ముద్రను పోగొట్టడం కోసం ఆరుగురు మహిళలతో కలిసి కొన్ని మాస్టర్ ప్లాన్స్ వేస్తూ పేదలకు సహాయం చేస్తూ.. వాళ్ళ పాలిట దేవుడిలా మారతాడు. ఆజాద్ వేసే ప్రతి ప్లాన్ టాప్ బిజినెస్ మ్యాన్ ఖాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి)ని టార్గెట్ చేస్తున్నట్లుగా అవుతుంది.

కట్ చేస్తే.. విక్రమ్ రాథోడ్ చనిపోలేదని తెలుసుకొని ఆజాద్, ఖాళీ గైక్వాడ్ షాక్ అవుతారు. అసలు ఆజాద్ ఎవరు? ఖాళీ గైక్వాడ్ తో ఆజాద్ & విక్రమ్ రాథోడ్ కి ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు మాంచి మసాలా దట్టించి అట్లీ వండిన సినిమానే “జవాన్”.

నటీనటుల పనితీరు: షారుక్ ఖాన్ ఈ సినిమాలో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం విశేషం. తన 30 ఏళ్ల కెరీర్లో షారుక్ ఇదే తొలిసారి కావడం గమనార్హం. తండ్రి మరియు కొడుకుగా షారుక్ స్వాగ్ & స్టైల్ మాస్ ఆడియన్స్ & షారుక్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తుంది. ముఖ్యంగా పఠాన్ తర్వాత జవాన్ లో సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ & ఎమోషనల్ సీన్స్ లో షారుక్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండడం అనేది అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిది.

నయనతార సినిమాలో హీరోయిన్ అనే కంటే సపోర్టింగ్ రోల్ అని చెప్పొచ్చు. కనీసం షారుక్ ఖాన్ తో ఒక్క రోమాంటిక్ ఎపిసోడ్ లేకపోవడం పెద్ద మైనస్. ఇక విజయ్ సేతుపతి మాత్రం షారుక్ కి గట్టి పోటీ ఇచ్చాడు.తన టిపికల్ హిందీ డైలాగ్ డెలివరీ & స్క్రీన్ ప్రెజన్స్ తో షారుక్ ను కూడా డామినేట్ చేశాడు విజయ్ సేతుపతి. ప్రియమణి, సానియా మల్హోత్రా, దీపికా పడుకొనేలు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: అనిరుధ్ మ్యూజిక్ సినిమాని చాలా చోట్ల కాపాడింది కానీ.. ఈ సినిమా విషయంలో అనిరుధ్ కంటే సినిమాటోగ్రాఫర్ జి.కె.విష్ణు ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. అతడి ఫ్రేమ్స్ & స్లో మోషన్ షాట్స్ హీరోయిజాన్ని వీరలెవల్లో ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా షారుక్ ఖాన్ ఇంట్రడక్షన్ సీన్ ఆయన కెరీర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ సీన్ కి ఇచ్చిన ఎలివేషన్ కు విష్ణు సినిమాటోగ్రఫీ వర్క్ భలే ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ డిజైన్ & సీజీ వర్క్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు చిత్రబృందం. అందువల్ల.. పోరాట సన్నివేశాల్లో లాజిక్స్ లేకపోయినా.. ఆ క్వాలిటీకి ఆడియన్స్ ఫిదా అవుతారు.

దర్శకుడు అట్లీ ఎప్పట్లానే ఓ అయిదారు శంకర్ సినిమాల కథలను కలగలిపి జవాన్ కథను అల్లుకొన్నాడు. చాలా సందర్భాల్లో ఇది శంకర్ సినిమానా అనే ఫీలింగ్ కలుగ్తుంది. అయితే.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తన మార్క్ చూపించాడు అట్లీ. మామూలుగా తన సినిమాల్లో కనీసం రెండు లేదా మూడు ఎమోషనల్ సీన్స్ పెట్టుకొనే అట్లీ.. జవాన్ లో ఏకంగా పదికి పైగా ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. మరీ ముఖ్యంగా టెక్నికల్ గా అట్లీకి ఉండే హోల్డ్ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇంత సాధారణమైన కథతోనే ఈ స్థాయి సినిమా తీయగలిగిన అట్లీ.. మంచి కథ దొరికితే వండర్స్ క్రియేట్ చేయడం ఖాయం.

విశ్లేషణ: షారుక్ ఫ్యాన్స్ & మాస్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకునే సినిమా “జవాన్”. షారుక్ ఖాన్ పెర్ఫార్మెన్స్, అనిరుధ్ మ్యూజిక్, జి.కె.విష్ణు ఫ్రేమింగ్స్ & ప్రొడక్షన్ వర్క్ కోసం ఈ సినిమాన్ని కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. అట్లీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా, షారుక్ ఖాన్ కు మరో 1000 కోట్ల సినిమాగా జవాన్ నిలుస్తుంది.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Click Here To Read in HINDI

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus