సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ ఘట్టమనేని ప్రస్తుతం తన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ, ఈ నెల 30న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, వరుస ఇంటర్వ్యూల్లో తన సినిమా ప్రయాణంతో పాటు వ్యక్తిగత అభిరుచుల గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయకృష్ణకు ఎదురైన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ బాబాయ్ మహేష్ బాబు తర్వాత తెలుగులో మీకు అత్యంత ఇష్టమైన హీరో ఎవరు?” అని అడగగా, చాలామంది మరోసారి మహేష్ గురించే మాట్లాడతారని భావించారు. అయితే జయకృష్ణ ఇచ్చిన సమాధానం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
మహేష్ బాబు తర్వాత తనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం అని జయకృష్ణ వెల్లడించారు. ప్రతి సినిమాకు రామ్ చరణ్ పెట్టే కృషి, ప్రతి పాత్ర కోసం ఆయన చూపించే అంకితభావం తనను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారు. నటుడిగా ఆయన చేసే ప్రయోగాలు, పాత్రలో కనిపించే తీరు తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ సినిమా కూడా చూసానని, అందులో ఆయన నటన చాలా నచ్చిందని పేర్కొన్నారు.
జయకృష్ణ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మహేష్ కుటుంబానికి చెందిన హీరో మరో స్టార్ హీరోపై ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక జయకృష్ణ నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా, జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ కూడా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచగా, ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి.