ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమా విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది జగన్ సర్కార్ నిర్ణయం సరైన నిర్ణయమే అని చెబుతుంటే మరి కొందరు మాత్రం ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధింపు చర్యలు వద్దని చెప్పారు. తెలంగాణ సర్కార్ సినిమా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఇలా ప్రోత్సహిస్తే సినీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కక్ష సాధింపు చర్యలు చేపడితే ఏపీలో సినిమా ఇండస్ట్రీకి మనుగడ లేకుండా పోతుందని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోలీసులు, ఎమ్మార్వోలు సినిమా థియేటర్లపై పడ్డారని పోలీసులు లా అండ్ ఆర్డర్ మరిచిపోయారని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. భీమ్లా ఈవెంట్ కు కేటీఆర్ హాజరు కావడంతో పవన్ కళ్యాణ్ కు మరింత మంచి పేరు వచ్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఇగో ఉంటుందని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సినిమా రంగానికి మంచిది కాదని ఆయన అన్నారు.
సినీ రంగం విషయంలో జగన్ వ్యవహార శైలిని మార్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ తీసుకునే చర్యల వల్ల పవన్ కు ఎలాంటి నష్టం లేదని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. జగన్ కక్ష సాధింపు చర్యలు ఆపాలని వీలైతే మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. చిరంజీవిని చూస్తే తనకు ఏడుపు వచ్చిందని చిరంజీవి చేతులు జోడించి దీనాతి దీనంగా జగన్ ను అడిగారని ప్రభాకర్ రెడ్డి కామెంట్లు చేశారు.
చిరంజీవి ఇండస్ట్రీ కోసం అలా అడిగారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ విషయంలో కక్ష సాధిస్తే ఈ రంగంపై ఆధార్పడిన వాళ్లు నాశనమైపోతారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.