‘జిగర్ తండ’.. నేటితరం సినిమా లవర్స్‌కి ఇదొక క్లాసిక్. మన దగ్గరకు వచ్చేసరికి కాస్త మసాలా మిక్స్ చేశారు కానీ.. తమిళంలో అదిరిపోయేలా తీశారు అని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కాని సీక్వెల్ ప్లాన్ చేశారు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. తమిళంలో బెస్ట్ డ్రామా థ్రిల్లర్‌గా నిలిచిన ‘జిగర్ తండ’ మజాని మరోసారి తీసుకొస్తున్నట్లు టీమ్ అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఓ టీజర్ కాని టీజర్‌ను రిలీజ్ చేసింది. సినిమాలోని రెండు మెయిన్ క్యారెక్టర్స్‌ను ఆ వీడియోలో పరిచయం చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.
‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కార్తీక్ సుబ్బరాజ్. ‘జిగర్ తండ’ సినిమాతో ఇటు ప్రేక్షకుల్ని, అటు సినీ విమర్శకులను మెప్పించారు. అందులో అతను ఎంచుకున్న కథ, అనుసరించిన స్క్రీన్ ప్లే, తీర్చిదిద్దిన పాత్రలు.. ఆ సినిమాకు కల్ట్ స్టేటస్ తీసుకొచ్చాయి. తమిళ వెర్షన్‌ను ఇతర భాషల వాళ్లు కూడా చూసి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా, హిందీలో ‘బచ్చన్ పాండే’గా రీమేక్ అయింది.
తెలుగు, హిందీ భాషల్లో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. అయితే ఒరిజినల్ చూసిన వాళ్లకు రీమేక్ వెర్షన్ చూస్తే అంత కిక్కు రాలేదు అంటారు. అయితే ఆ సినిమా తర్వాత ఆ స్థాయి సినిమాలు చేయలేదు. ‘ఇరైవి’, ‘పేట’, ‘జగమేతంత్రం’, ‘మహాన్’ లాంటి పెద్ద సినిమాలే చేశారు.. కానీ అవేవీ విజయాలు అందించలేదు. దీంతో తనకు ఎంతో పేరు తెచ్చిన ‘జిగర్ తండ’ సినిమా సీక్వెల్ ఎత్తుకున్నారు కార్తిక్ సుబ్బరాజ్.
‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ అనే టైటిల్ పెట్టి, రెండు గన్నులతో డిఫరెంట్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీనికి వెరైటీ టీజర్ కూడా యాడ్ చేశారు. ‘జిగర్ తండ’లో హీరో, విలన్ పాత్రలు చేసిన సిద్దార్థ్, బాబీ సింహా ఇందులో లేరు. వారికి బదులు లారెన్స్, ఎస్.జె.సూర్య వచ్చారు. టీజర్లో ఎస్.జె.సూర్య స్టయిల్‌గా గన్ను మౌతార్గన్ ఊదుతూ కనిపిస్తే.. లారెన్స్ ఫుల్ మాస్ లుక్‌లో కత్తులు తయారు చేస్తూ కనిపించారు. టీజర్ ఆఖరున గన్ను తీస్తాడనుకుంటే.. లేజర్ గన్ లాంటి కెమెరా తీసి షాక్ ఇచ్చాడు లారెన్స్. చూడాలి సినిమాలో ఇంకెన్ని షాక్‌లు ఉంటాయో.