వరుస పరాజయాలతో తన ప్రాభవాన్ని కోల్పోయిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం “క” (KA) . ఈ సినిమాకి కిరణ్ అబ్బవరం నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించాడు. ఈ సినిమా గనుక డిఫరెంట్ గా లేకపోయినా, బ్యాడ్ ఫిలిం అనిపించుకున్నా ఇక సినిమాలు చేయడం ఆపేస్తానని కిరణ్ అబ్బవరం పబ్లిక్ గా ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. మరి కిరణ్ చేసిన ఛాలెంజ్ ను “క” చిత్రం నిలబెట్టుకోగలిగిందా? కిరణ్ కి కమర్షియల్ హిట్ కట్టబెట్టగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ: 1977లో జరిగిన ఓ హత్య కేసు నిమిత్తం వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం)ను ప్రశ్నించడానికి కొందరు సీక్రెట్ ఏజెంట్స్ ఎవరికీ తెలియని ఓ ప్లేస్ కి తీసుకొస్తారు. అక్కడ వాసుదేవ్ ను ప్రశ్నిస్తుండగా, పక్క బ్లాక్ లోనే రాధ (తన్వి రామ్) (Tanvi Ram) ను మరికొంత మంది సీక్రెట్ ఏజెంట్స్ ప్రశ్నిస్తుంటారు. మధ్యమధ్యలో వాసువేద్ & రాధ మాట్లాడుకొంటుంటారు. ఈ క్రమంలో కృష్ణగిరి అనే గ్రామం, ఆ గ్రామంలోని ప్రజలు తదితర వివరాల వెలుగులోకి వస్తాయి. ఆ గ్రామంలో ఆడపడుచులు తరచుగా మిస్ అవుతుంటారు.
వాసుదేవ్ ను హత్య కేసులో అరెస్ట్ చేసింది ఎవరు? అతడ్ని హిప్నాటిజం కారణంగా ప్రశ్నించడానికి కారణం ఏమిటి? కృష్ణగిరిలో మాయమవుతున్న ఆడపిల్లలకు వాసుదేవ్ కు సంబంధం ఏమిటి? అసలు కృష్ణగిరిలో ఏం జరుగుతుంది? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “క” చిత్రం.
నటీనటుల పనితీరు: రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న వాసుదేవ్ అనే క్యారెక్టర్లో కిరణ్ అబ్బవరం చక్కని పరిణితి కనబరిచాడు. అతడి బాడీ లాంగ్వేజ్ లో మాత్రమే కాదు యాస, వాచకంలోనూ మంచి వేరియేషన్ కనిపించింది. నటుడిగా తనను తాను అప్డేట్ చేసుకున్న విధానం బాగుంది. వేరియేషన్ కనబరచడం లేదంటూ అతడిపై వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానం చెప్పాడు కిరణ్ అబ్బవరం. నయన్ సారిక (Nayan Sarika) పేరుకు తగ్గట్లే తన కళ్ళతోనే చక్కని హావభావాలు పలికించి సినిమాకు సహజమైన అందాన్ని జోడించింది. చక్రాల్లా తిరిగే ఆమె కళ్ళల్లో తొణికిసలాడిన ఆమె హొయలు భలే చూడముచ్చటగా ఉన్నాయి.
మలయాళ నటి తన్వి రామ్ ఓ కీలకపాత్రలో విశేషంగా ఆకట్టుకుంది. తమిళ నటుడు రెడిన్ కింగ్స్లే (Redin Kingsley) తనదైన మార్క్ కామెడీతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ అది తెలుగు ప్రేక్షకుల్ని అలరించడం కష్టమే. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ (Achyuth Kumar) తన పాత్రకు న్యాయం చేశాడు.
సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో అందరికంటే ఎక్కువగా అలరించిన నటి బిందు చంద్రమౌళి. ఇప్పటివరకు చిన్నపాటి పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఈ సినిమాలో పోషించిన పాత్రతో తన స్థాయిని పెంచుకుందనే చెప్పాలి. ఇప్పటికైనా ఆమెను సైడ్ క్యారెక్టర్ రోల్స్ కి కాకుండా కాస్త ప్రాధ్యాన్యత ఉన్న పాత్రలకు కన్సిడర్ చేస్తే బాగుంటుంది.
సాంకేతికవర్గం పనితీరు: సాధారణంగా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్ మంచి మార్కులు కొట్టేస్తుంటారు. కానీ “క” సినిమా విషయంలో మాత్రం ఎడిటర్ శ్రీ వరప్రసాద్ ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. ఏ షాట్ కి టైట్ జూమ్ పడాలి, ఏ షాట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి వంటి విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి క్రేజీ కట్స్ ఇచ్చాడు.
ఇక సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ (Sam C. S.) ఫస్ట్ ఫ్రేమ్ నుండే తన ప్రతిభను చాటుకోవడం మొదలుపెట్టాడు. సన్నివేశం, సందర్భం, ఎమోషన్ కు తగ్గట్లుగా డిఫరెంట్ మూడ్స్ ను క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాటోగ్రాఫర్ల ద్వయం సతీష్ రెడ్డి మాసం (Sateesh Reddy Masam), డానియల్ విశ్వాస్ (Viswas Daniel)లు దర్శకుడు పేపర్ పై రాసుకున్న సన్నివేశాలను తెరకెక్కించిన విధానం అదిరింది. ముఖ్యంగా కోర్టు సీక్వెన్స్ & క్లైమాక్స్ షాట్స్ చూస్తే సినిమాటోగ్రాఫర్ల పనితనానికి ఫిదా అవ్వాల్సిందే.
ఇక దర్శకుల ద్వయం సుజీత్ & సందీప్ ‘క’ర్మ కాన్సెప్ట్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. షాట్ కంపోజిషన్ లో చూపిన నవ్యత ప్రేక్షకులకు కచ్చితంగా మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అయితే.. దర్శకులుగా తమ అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శించిన సుజీత్ & సందీప్ లు రచయితలుగా మాత్రం తడబడ్డారు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి, అలాగే కొన్నిటికి సరైన సమాధానాలు చెప్పలేదు.
ఎంతో ఓపిగ్గా వేసిన చిక్కుముడులను అంతే నేర్పుతో విప్పినప్పుడే ఈ తరహా థిల్లర్స్ ఆకట్టుకుంటాయి. ఆ విషయంలో మాత్రం ఈ దర్శక ద్వయం కాస్త పక్కదోవ పట్టారు. అయితే.. క్లైమాక్స్ సీన్ ను కన్సీవ్ చేసిన విధానం, “క” అనే టైటిల్ కు ఇచ్చిన జస్టిఫికేషన్ మాత్రం తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. దర్శకులుగా సుజీత్ & సందీప్ భవిష్యత్ లో మంచి పేరు తెచ్చుకోవడం ఖాయం.
విశ్లేషణ: ఒక్కోసారి “అర్రే! ఆ ఒక్క విషయంలో జాగ్రత్తపడి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదే” అని తెగ గింజుకుపోతుంటాం. “క” కచ్చితంగా ఆ కోవలో చేరే సినిమానే. టెర్రిఫిక్ బ్యాగ్రౌండ్ స్కోర్, అద్భుతమైన ఎడిటింగ్, క్రియేటివ్ షాట్ కంపోజీషన్, మంచి ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ ఉన్నా.. చాలా కీలకమైన కథనం విషయంలో మాత్రం సినిమా కాస్త ఇబ్బందిపడింది. ఆ ఒక్క మైనస్ పాయింట్ ను పక్కన పెడితే.. “క” కచ్చితంగా అలరిస్తుంది.
ఫోకస్ పాయింట్: ‘క’oటెంట్ తో కొట్టావయ్యా కిరణ్!
రేటింగ్: 3/5