మనకి నచ్చిన సెలెబ్రిటీని కలిసి మాట్లాడాలని, ఫోటో దిగాలని కోరిక ఉండడం సహజమే. దానికోసం మనం ఏంచేస్తాం..? ఆ సెలబ్రిటీ షూటింగ్ స్పాట్ కు వెళ్ళి ఎదురుచూస్తుంటాం… లేదా పుట్టినరోజు వేడుకలో కలవడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ఇక్కడో అభిమాని తనకి నచ్చిన సెలెబ్రిటీని కలవడం కోసం ఏకంగా 60 లక్షలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరలవుతుంది. విషయం ఏమిటంటే… సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో కాజల్ కూడా ఒకరు. ఇదిలా ఉండగా.. సినీ తారల పేరుతో జరుగుతున్న ‘సైబర్ క్రైమ్స్’ మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాజల్ పేరుతో కొందరు సైబర్ నేరగాళ్ళు బాగా డబ్బున్న ఓ వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని టోపీ పెట్టేసారట.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రామాంతపురంకి చెందిన ఓ యువకుడి గత కొన్ని రోజులుగా ఓ వెబ్ సైట్ ని గమనిస్తున్నాడట. ఆ వెబ్ సైట్ లో కొన్ని లింకులు క్లిక్ చేస్తే మరో పేజీకి రీడైరెక్ట్ అవుతున్నాయి. అలా రీడైరెక్ట్ అయిన ఓ పేజీలో మీ అభిమాన హీరోయిన్లని ప్రత్యేకంగా కలుసుకునే ఏర్పాటు చేస్తాం అని ఉండటం గమనించాడు. ఈ క్రమంలో ఈ యువకుడు కాజల్ అగర్వాల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ వెబ్ సైట్ లో తన వ్యక్తిగత వివరాలని కూడా ఎంటర్ చేసాడు. సదరు సైబర్ నేరగాళ్లు ఇతడు ధనవంతుడైన వ్యాపారవేత్త కుమారుడు అని పసిగట్టి… మొదట ఆన్లైన్ లో 50 వేలు చెల్లించాడట. తరువాత సదరు సైబర్ నేరగాళ్ళు ఇతని మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టరాట. అలా దాదాపు 60 లక్షల వరకూ ఆ యువకుడిని నుండీ లాగేసుకున్నారట. దీంతో భయాందోళనకు గురైన ఆ యువకుడు కొన్ని రోజులపాటు కోల్‌కతా కి వెళ్ళిపోయాడట. చివరికి అతని జాడను కనిపెట్టిన పోలీసులు ఆరా తీయగా జరిగిన మోసాన్ని వివరించాడు. తక్కువ సమయంలోనే ఈ కేసుని చేధించిన పోలీసులు సైబర్ నేరగాళ్ళని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ లో కనిపించే ఫేక్ లింకులు, ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలనే విషయం ఈ సంఘటన ద్వారా మరోసారి అందరికీ తెలిసింది. ‘ఆ యువకుడు బాగా డబ్బులున్న వ్యక్తి కాబట్టి వేరే చోటికి పారిపోయాడు.. అదే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే భయంతో చేయకూడనిది చేసుకునేవాడు’ అంటూ కొందరు నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.