శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath), కిషోర్ కుమార్ (Kishore Kumar) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కలియుగం 2064’ (Kaliyugam 2064). సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన మూవీ ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రానా వంటి స్టార్స్ ఈ ట్రైలర్ ను కాన్సెప్ట్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు వేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీంతో సినిమా పై ఆడియన్స్ దృష్టి పడింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారి అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం రండి :
కథ: అది 2064 సంవత్సరం.. ప్రపంచం మొత్తం నాశనం అయిపోయి డబ్బున్నోళ్లు రెసిడెంట్స్ గా ఒక నగరాన్ని నిర్మించుకొని సుఖంగా బ్రతుకుతుండగా.. డబ్బులేని వాళ్లు మాత్రం ఆకలికి తట్టుకోలేక, ఆరోగ్యంగా బ్రతకలేక లిబరేటర్స్ గా నానా ఇబ్బందులు పడుతుంటారు.
రెసిడెంట్స్ దగ్గరకి చేరుకొనే ప్రయాణంలో అనుకోకుండా భూమి (శ్రద్ధ శ్రీనాథ్) ప్రాణాలు కాపాడుకునే క్రమంలో థామస్ (ఇనియన్ సుబ్రమణి) (Iniyan Subramani) దగ్గర ఇరుక్కుంటుంది.
ఆమెకు మంచి బట్టలు ఇవ్వడమే కాక, రోజు కడుపు నిండా తిండి పెడుతుండే థామస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి భూమికి. అసలు థామస్ ఎవరు? భూమిని ఎందుకని బంధించి పెడతాడు. అక్కడి నుంచి భూమి ఎలా తప్పించుకుంది? అనేది “కలియుగం 2064” కథాంశం.
నటీనటుల పనితీరు: శ్రద్ధ శ్రీనాథ్ ను ఇప్పటివరకు ఈ తరహా పాత్రలో చూసి ఉండకపోవడంతో.. ఆమె నటన చాలా కొత్తగా కనిపిస్తుంది. అదే విధంగా.. ఆమె పాత్ర భవిష్యత్ మనిషి మనస్తత్వానికి అద్దం పడుతుంది.
ఇక థామస్ పాత్రతో ఒక రియాలిటీ చెక్ ఇచ్చాడు దర్శకుడు. ఇనియన్ సుబ్రమణి కూడా ఆ పాత్రలో అంతే క్రూరంగా కనిపించాడు. అతడి పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో, అంతే నిజాయితీగా కూడా ఉంటుంది. మొదట్లో ఆ పాత్ర ఎంత భయపెడుతుందో, చివరికి వచ్చేసరికి అంతే స్థాయిలో ఆలోచింపజేస్తుంది.
సినిమా మొత్తం నడిచేది కిషోర్ కుమార్ నరేషన్ లోనే. అయితే అతని పాత్ర ఇంకాస్త ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ప్రమోద్ సుందర్ (Pramodh Sundar) ఆలోచనాధోరణిని కచ్చితంగా మెచ్చుకోవాలి. మనిషి మానవత్వంతో వ్యవహరించాలి కానీ, మృగంలా కాదు అనే మెసేజ్ ను ఇవ్వడంలో కచ్చితంగా సక్సెస్ అయ్యాడు. అయితే.. అతడి ఆలోచనను తెరపై చూపించడంలో మాత్రం తడబడ్డాడు.
ఈ సినిమాకి మెయిన్ హీరోస్ సినిమాటోగ్రాఫర్ కె.రామ్ చరణ్ (K Ramcharan) & ఆర్ట్ డైరెక్టర్ శక్తీ వెంకట్రాజ్. 2064 టైంలైన్ ను, థామస్ ఇంటిని క్రియేట్ చేసిన విధానం బాగుంది. అలాగే ఆర్జీబీ లైటింగ్ తోనే రకరకాల ఎమోషన్స్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది.
ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. సీజీ వర్క్ వర్క్ కూడా పర్వాలేదు. అయితే ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది.
విశ్లేషణ: కొన్ని కథలు ఆలోచన వరకు చాలా బాగుంటాయి. “కలియుగం 2064” కూడా ఆ తరహా చిత్రమే. చాలా ఆలోచనలున్నాయి, చాలా ఆశయాలున్నాయి. అయితే దర్శకుడు స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఇప్పటికైతే ‘కలియుగం 2064’ గొప్ప ఆశయం కలిగిన అబౌవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది. హై టెక్నికల్ వాల్యూస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.
ఫోకస్ పాయింట్: విజన్ మంచిదే
రేటింగ్: 2.5/5