పెద్ద సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ధరలు ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా సినిమా టీమ్‌లు రిక్వెస్ట్‌లు చేస్తాయి. వాటిని ప్రభుత్వం చూసి ఓకే చేస్తుంది కూడా. గత కొన్నేళ్లుగా ఇలానే జరుగుతూ ఉంది. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాకు సంబంధించి పెంచిన ధరల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం చూస్తే ‘కల్కి’ చాలా కాస్ట్‌లీ గురూ అనిపించకమానదు.
ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) – దీపిక పడుకొణె (Deepika Padukone) – అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) – కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుండి జులై 4 వరకు అంటే 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సినిమా బృందానికి వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌లో రూ.100 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల ప్రత్యేక షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఐదు షోలు వేసుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ‘కల్కి 2898 ఏడీ’ టికెట్ ధరలపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయమూ తేలిపోతుందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా టికెట్ ధరలు తెలంగాణ స్టైల్‌లోనే ఉంటాయి అంటున్నారు. అయితే గత ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు ఇవ్వడంలో మొండి చేయి చూపించింది. ఇప్పుడు సినిమా ప్రో ప్రభుత్వం రావడంతో అక్కడ కూడా ఇలాంటి రేట్లే ఉంటాయి అని చెప్పొచ్చు. అయితే ఈ అధిక ధరలు ఫుట్ ఫాల్స్ మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయేమో చూడాలి.