మూవీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒక సినిమాకి బదులు మరో సినిమాకు టికెట్ బుక్ చేయడం గురించి ఎప్పుడూ విని ఉండరు, అలాగే చేసి ఉండరు కూడా. అయితే ఒక షో అనుకుని మరో షోకి బుక్ చేసి ఉండొచ్చు. కానీ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ చేసిన తప్పిదం వల్ల ఒక సినిమాకు టికెట్ బుక్ చేస్తే మరో సినిమాకు బుక్ అయింది. అయితే తప్పు తెలుసుకున్న టీమ్ ఇప్పుడు సర్దబాటు చర్యలు చేపట్టింది. ఇంతకీ ఏమైందంటే?
ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుండి తెలంగాణలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే బుక్ మై షో వేదికగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ‘కల్కి 2898 ఏడీ’ టికెట్ బుక్ చేసుకోగా, రాజశేఖర్ (Rajasekhar) , ప్రశాంత్ వర్మల (Prasanth Varma) ‘కల్కి’ సినిమాకు టికెట్ బుక్ అయింది. టికెట్‌ను త్వరగా బుక్ చేసుకోవాలన్న తొందరలో యూజర్లు సినిమా పేరును సరిగ్గా గమనించలేదు.
బుకింగ్ అయ్యాక టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని చూస్తే.. దాని మీద రాజశేఖర్ ‘కల్కి’ సినిమా పోస్టర్ కనిపించింది. దీంతో టికెట్ బుక్ చేసుకున్నవారు అవాక్కయ్యారు. ఈ విషయమై కొంతమంది సోషల్ మీడియాలో బుక్‌మై షోను వివరణ కోరగా.. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, రాజశేఖర్ ‘కల్కి’కి టికెట్ బుక్ అయినట్లు కనిపించినా.. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’కి టికెట్‌బుక్ అయినట్లు భావించండి అని తేల్చింది.
సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందని, త్వరలో సమస్యను పరిష్కిస్తాం అని చెప్పింది. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజశేఖర్ కూడా సరదాగా స్పందించారు. ‘ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని కామెంట్ చేశారు. అలాగే ‘కల్కి 2898 ఏడీ’ బృందానికి విషెష్ కూడా చెప్పారు.