సోగ్గాడే చిన్నినాయనాలో నాగార్జునను రెండు షేడ్స్ లలో డైరక్టర్ కళ్యాణ్‌కృష్ణ బాగా చూపించారు. ముఖ్యంగా ఇందులోని బంగార్రాజు పాత్ర అందరికీ బాగా నచ్చింది. అందుకే అదే టైటిల్ తో సినిమా తీస్తానని అప్పుడే ప్రకటించారు. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే నిర్మిస్తానని మీడియాతో చెప్పారు. అయితే ఈ మధ్య దీనిపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. బంగార్రాజు కథను కళ్యాణ్ కృష్ణ బాగా రాయలేకపోయారని, అందుకే ఆ కథని చేయనని నాగార్జున చెప్పినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే ఆ కథను రవితేజతో కళ్యాణ్‌కృష్ణ చేయబోతున్నట్లుగా ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
ఈ వార్తలపై దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ స్పందించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” బంగార్రాజు చిత్రం రవితేజగారితో చేస్తున్నామని వస్తున్న వార్తలు అవాస్తవం. రవితేజగారికి చెప్పింది మరొక కథ. బంగార్రాజు అంటే నాగార్జునగారే. ఆయన మాత్రమే ఆ పాత్రకు సరిపోతారు. వేరే ఎవర్నీ ప్రేక్షకులు ఊహించుకోలేరు. బంగార్రాజు కచ్చితంగా హిట్ కొట్టాలని స్క్రిప్ట్ రాస్తున్న” అని పుకార్లకు చెక్ పెట్టారు.