Kalyanam Kamaneeyam Review In Telugu: కళ్యాణం కమనీయం సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 14, 2023 / 04:17 PM IST

Cast & Crew

  • సంతోష్ శోభన్ (Hero)
  • ప్రియభవాని శంకర్ (Heroine)
  • దేవి ప్రసాద్, పవిత్రా లోకేష్, కేదార్ శంకర్, 'సత్యం' రాజేష్, సప్తగిరి తదితరులు (Cast)
  • అనిల్ కుమార్ ఆళ్ళ (Director)
  • యువి కాన్సెప్ట్స్ (Producer)
  • శ్రవణ్ భరద్వాజ్ (Music)
  • కార్తీక్ ఘట్టమనేని (Cinematography)

హిట్ కోసం ఘజనీ మహమ్మద్ రేంజ్ లో వరుస సినిమాలతో దండయాత్రలు చేస్తున్న సంతోష్ శోభన్ హీరోగా రూపొంది, థియేటర్లలో విడుదలైన మరో సినిమా “కళ్యాణం కమనీయం”. సంతోష్-ప్రియభవాని శంకర్ లు జంటగా అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు (జనవరి 14) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!

కథ: బీటెక్ కంప్లీట్ చేసి.. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఉద్యోగం దొరక్క తండ్రి సంపాదన మీద ఆధారపడి బ్రతికే కుర్రాడు శివ (సంతోష్ శోభన్). ప్రేమించిన శ్రుతి (ప్రియభవాని శంకర్)ను పెద్దల్ని ఒప్పించి పెళ్లాడి.. వేరు కాపురం పెడతాడు. రోజూ డబ్బులు, ముద్దులు ఇచ్చే పెళ్ళాం, ఫ్లాట్ రెంట్ కట్టే మావయ్యాల పుణ్యమా అని.. అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ కులాసాగా బతుకు బండి లాగించేస్తుంటాడు.

అయితే.. ఒకానొక సందర్భంలో శివ కెరీర్ ప్లాన్ & జాబ్ అతడి లైఫ్ కి చాలా క్రూషియల్ గా మారుతుంది. అలాంటి పరిస్థితిలో శివ ఏం చేశాడు? అనేది “కళ్యాణం కమనీయం” కథాంశం.

నటీనటుల పనితీరు: సంతోష్ శోభన్ మంచి నటుడే కానీ.. హావభావాల ప్రకటనలో ఒకే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాడు. అన్నీ సినిమాలకూ ఒకే తరహా మ్యానరిజమ్స్ సెట్ అవ్వవు. ఆ విషయాన్ని సంతోష్ త్వరగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే నటుడిగా తన వెర్సటాలిటీని చాటుకోవాల్సిన సమయం కూడా వచ్చింది.

తమిళ నటి ప్రియభవాని శంకర్ ఈ చిత్రంలో శ్రుతి అనే ఆధునిక యువతి పాత్రలో ఒదిగిపోయింది. అయితే.. సంతోష్ కంటే పెద్ద వయసు గల యువతిగా కనిపించడం చిన్న మైనస్. నటిగా మాత్రం ఆమెకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కాంబినేషన్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే మంచి కెరీర్ ఉంటుంది.

కేదార్ శంకర్ మరోసారి తండ్రి పాత్రలో.. ఆరోగ్యవంతమైన హాస్యంతో ఆకట్టుకున్నారు. సద్దాం పంచులు అక్కడక్కడా పేలాయి.

సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమాకి పాజిటివ్ పాయింట్స్. మిగతా శాఖల వారు కూడా కష్టపడినప్పటికీ.. ఎవరి వర్క్ పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. దర్శకుడు అనిల్ కుమార్ ఒక సాధారణ, చాలా చిన్న కథను హృద్యంగా చెప్పాలనుకున్నాడు. ఈమధ్య వచ్చిన ధనుష్ “తిరు” ఆ తరహా సినిమానే.

కానీ.. సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలు, సందర్భాలు కంపోజ్ చేసుకోకపోతే సినిమాకి ఎంత నెగిటివ్ అవుతుంది అనేది “కళ్యాణం కమనీయం”తో ప్రూవ్ అవుతుంది. ఉద్యోగం లేని భర్త, పోషించే భార్య పాత్రలతో ఇప్పటికీ వందల సినిమాలు వచ్చాయి. అయితే.. “మిస్టర్ పెళ్ళాం” రేంజ్ లో హిట్ అయిన సినిమాల సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.

“కళ్యాణం కమనీయం” విషయంలో జరిగింది కూడా ఇదే.. సినిమాలో హీరో లేదా హీరోయిన్ పాత్రకి ఎవరూ కనెక్ట్ అవ్వలేరు. అలాగే.. సినిమాలో ఎక్కడా ఎమోషనల్ కనెక్ట్ కానీ, పెయిన్ కానీ లేదు. అందువల్ల 106 నిమిషాల సినిమా కూడా మెగా సీరియల్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. సో, అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకుడిగా, కథకుడిగా విఫలమయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ: “శంకర్ దాదా జిందాబాద్” లాంటి బ్లాక్ బస్టర్ తోపాటుగా విడుదలైన “ఆనంద్” సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అందుకు కారణం సినిమాలో కంటెంట్ & ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవ్వడం. కానీ.. “కళ్యాణం కమనీయం”లో ఆ రెండూ లేకపోవడంతో, ఈ సంక్రాంతి రేస్ లో స్టార్ హీరోల సినిమా మధ్య నలిగిపోవడం మినహా.. థియేటర్లలో ఆడడం అనేది కష్టమే!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus