కమల్ హాసన్ నటుడిగాకంటే దర్శకుడిగా చేసిన ప్రయోగాలే ఎక్కువ. అయితే.. అలా దర్శకుడిగా ఆయన చేసిన ప్రయత్నాల్లో పరాజయంపాళ్ళు ఎక్కువ. అందుకే అతడ్ని దర్శకుడిగా కంటే నటుడిగానే అందరూ ఇష్టపడతారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆఖరి విజయవంతమైన చిత్రం “విశ్వరూపం”. ఆ తర్వాత ఆయన వేరే దర్శకుల చిత్రంతోనే నటించారు.
అలా నటించిన “చీకటిరాజ్యం” చిత్రం మంచి విజాయాన్నందుకొంది. అదే జోరులో రాజీవ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాను మొదలెట్టాడు. కానీ.. తీరా షూటింగ్ మొదలయ్యేప్పటికి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించేందుకు వీలుపడడం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదన్న కారణంతో ఇప్పుడు తాజా చిత్రానికి కమలే స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు.
అయితే.. కొంతమంది మాత్రం కమల్ ఇదంతా కావాలనే చేశాడని, తన దర్శకత్వంలో మొదలైన “విశ్వరూపం 2, మరునాధయాగం” లాంటి సినిమాలు ఇంకా విడుదలకాలేక పురుటి నొప్పులు పడుతుండడంతో.. మళ్ళీ తానే దర్శకత్వం వహిస్తే కొత్త సినిమాకు క్రేజ్ రాదనుకొని, ఇలా రాజీవ్ కుమార్ పేరు వాడుకొని.. ఆఖరికి తానే తెరపైకి వచ్చాడని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణల సంగతి పక్కన పెడితే.. సినిమా హిట్టయితే ఇవన్నీ గాలివార్తలంటూ కొట్టేయడం ఖాయమనుకోండి అది వేరే విషయం!