సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ చిత్రం ‘కంగువా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రీస్తు శకం 1000 – 1100 మధ్య కాలంలో జరిగిన కథతో, సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటానీ వంటి స్టార్ కాస్ట్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేసినా, విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది.
ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌లో రూ.100 కోట్ల వరకు నష్టాలు రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. 350 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ చిత్రానికి, విడుదల తర్వాత కూడా కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి నష్టం నుంచి బయటపడాలని ప్రయత్నించినా, ఆ ప్రయోగం ఫలించలేదు. వసూళ్లు ఆశించినంతగా రావడం లేదని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిర్మాత జ్ఞానవేల్ రాజాకు మద్దతుగా సూర్య ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
నిర్మాతను నష్టాల నుంచి బయట పడేసేందుకు తన వంతు సాయం చేయాలని, తక్కువ బడ్జెట్‌తో ఒక చిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై సూర్య ఒక ప్రత్యేక సినిమా చేయబోతున్నారని, దీని కోసం ఆయన తన రెమ్యునరేషన్ కూడా తగ్గించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేశారు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ షెడ్యూల్ సిద్ధంగా ఉంది.
ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై సూర్య తీసుకున్న చిన్న బడ్జెట్ సినిమాకు కార్యరూపం దాల్చనున్నారు. సూర్య తీసుకున్న ఈ నిర్ణయం, తనకు ఉన్న నిబద్ధతను సూచిస్తుందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ‘కంగువా’ వంటి భారీ చిత్రాల్లో నష్టాలు కలిగినప్పటికీ, సూర్య తన ప్రతిష్ఠను పక్కన పెట్టి నిర్మాతకు మద్దతుగా నిలిచిన తీరు సొంత చిత్రపరిశ్రమలో ప్రశంసలు కురిపిస్తోంది.