శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో దర్శన్ ఒకరు. గతేడాది కాటేరా సినిమాతో దర్శన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అయితే హత్య కేసులో బెంగళూరు పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేయడం కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కామాక్షిపాళ్య పోలీసులు ఈరోజు తెల్లవారుజామున ఆర్.ఆర్ నగర్ లోని దర్శన్ నివాసంలో అరెస్ట్ చేశారు.
ప్రముఖ నటి పవిత్ర గౌడకు అసభ్యకరంగా సందేహాలు పంపినందుకు రేణుకాస్వామి హత్య జరగగా దర్శన్ సూచనల మేరకు ఈ హత్య జరిగినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 48 గంటల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కాగా మృతుడు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అని తెలిసింది.
పోలీస్ కమిషనర్ దయానంద్ రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని వెల్లడించారు. జూన్ నెల 9వ తేదీన రేణుకా స్వామి మృతి చెందగా నలుగురు వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రేణుకా స్వామి చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని కల్వర్టులో పడేశారు.
కన్నడ నటి పవిత్ర గౌడ, దర్శన్ మధ్య ఏదో ఉందని గతంలో పలు వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఆ సమయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి పవిత్ర గౌడపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేణుకా స్వామి కూడా పవిత్రను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడంతో ఆమెకు అసభ్యకర సందేహాలు పంపారని భోగట్టా. దర్శన్ నిజంగానే తప్పు చేశారా? అంటూ ఆయన అభిమానులు ఒకింత షాక్ కు గురవుతున్నారు.