దేవుడు విషయంలో జోకులేంటి? గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి ఎదురవుతున్న ప్రశ్న ఇదే. ‘కాంతార’ సినిమాలోని కీలకమైన కొన్ని సన్నివేశాల్లో పాత్రధారి ఎక్స్‌ప్రెషన్ల గురించి ఆయన ఇటీవల ఓ వేదిక మీద జోకులేశారు. ఇమిటేట్ చేస్తూ ఇబ్బందికరంగా ప్రవర్తించారు. ఎందుకు చేశారో తెలియదు కానీ.. స్టేజీ దిగువ ఉన్నవాళ్లు అది చూసి నవ్వేశారు. అయితే అది తప్పని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి రణ్‌వీర్ సింగ్ రియాక్ట్ అయి తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు.
ఇక్కడితో విషయం ఆగిపోయింది.. ఇంకేం ఇబ్బంది లేదు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ‘కాంతార’లోని దైవిక సన్నివేశాన్ని రణ్‌వీర్ ఇమిటేట్ చేశారని అడ్వొకేట్ ఒకరు గతేడాది డిసెంబరులో బెంగళూరులోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పడుఉ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులోని ది హై గ్రౌండ్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. ‘కాంతార’ సినిమాలోని పంజుర్లి, గులిగ వ్యక్తీకరణలను రణ్‌వీర్ అసభ్యకర రీతిలో అనుకరించారని అడ్వొకేట్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చాముండి అమ్మవారిని రణ్‌వీర్ సింగ్ భూతంగా పేర్కొన్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు కేసు నమోదు అయిన నేపథ్యంలో ఏప్రిల్ 8న ఈ విషయంలో తొలి విచారణ జరగనుంది. అప్పుడు ఎవరి వాదనలేంటి, న్యాయస్థానం ఏమంటుంది అనేది చూడాలి. అసలేమైందంటే.. 2025లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో ‘కాంతార’ సినిమాలోని ఓ సీన్‌ను కామెడీగా అనుకరించారు రణ్‌వీర్. అలా చేయడంపై కన్నడిగులు అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రిషబ్ ఆ సన్నివేశాలు బాగా చేశారని చెప్పడం కోసం నేను అలా వేదికపై నటించాను. ఆ సన్నివేశాల్లో నటించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎంతో కష్టమైన ఆ సీన్స్‌ని అద్భుతంగా చేయగలరు కాబట్టే ఆయనంటే నాకు ఇష్టం. మన దేశంలోని అన్ని సంప్రదాయాల మీద నాకు గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి’’ అని అప్పుడు రణ్‌వీర్ తన క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.